టెన్త్, ఇంటర్ ఫలితాలపై స్పష్టత కరవు! విద్యార్థుల్లో ఆందోళన

Written by RAJU

Published on:


ABN
, First Publish Date – 2023-05-08T12:31:35+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల వెల్లడిపై అస్పష్టత నెలకొంది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది

టెన్త్, ఇంటర్ ఫలితాలపై స్పష్టత కరవు! విద్యార్థుల్లో ఆందోళన

Inter results

ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడు?

పరీక్షలు ముగిసి 40 రోజులైనా అస్పష్టతే

9న ప్రకటించవచ్చని బోర్డు వర్గాల అంచనా

తేల్చని అధికారులు.. విద్యార్థుల్లో ఆందోళన

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల వెల్లడిపై అస్పష్టత నెలకొంది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి 29 మధ్య ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియ 20 రోజుల క్రితమే పూర్తయింది. అయితే ఇప్పటికీ ఫలితాలను వెల్లడించలేదు. సాధారణంగా పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే ఫలితాల ప్రకటనకు అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆలస్యం జరగడంతో ఎప్పుడు వస్తాయన్న చర్చ మొదలైంది. జాప్యం జరిగే కొద్దీ దాని ప్రభావం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలపై పడనుంది. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. ఇందులో ఉత్తీర్ణులైతే విద్యా సంవత్సరం వృధా కాకుండా పై చదువులకు వెళ్లవచ్చు. ఈ నెలలో ఎంసెట్‌తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ఫలితాలను మే చివర్లో లేదా జూన్‌ మొదట్లో ప్రకటించనున్నారు. అనంతరం ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను త్వరగా వెల్లడిస్తేనే విద్యార్థులు ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం కూడా మళ్లీ పరీక్షలు రాస్తారు. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఒకటి రెండు రోజుల్లోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డులోని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారని చెప్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 9న ప్రకటించే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

టెన్త్‌ ఫలితాలు సిద్ధం!

పదో తరగతి ఫలితాలను ప్రకటించడానికి వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్‌ ఫలితాలు వెల్లడించిన ఒకటి రెండు రోజుల తర్వాత టెన్త్‌ ఫలితాలు ప్రకటించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ మధ్య టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది 6 పేపర్లే కావడంతో వాల్యుయేషన్‌ త్వరగా పూర్తి చేశారు.

Updated Date – 2023-05-08T12:32:13+05:30 IST

Subscribe for notification