సీఆర్పీఎఫ్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులు
వాటిల్లో మహిళలకు 4,667
మాజీ అగ్నివీరులకు 10% కోటా
పదో తరగతి పాసైన వారు అర్హులు
వయోపరిమితి 18-23 సంవత్సరాలు
అగ్నివీరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల (Constable Posts) భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో 1,25,262 పోస్టులను పురుషులకు, 4,467 పోస్టులను మహిళలకు కేటాయించింది. మొత్తం పోస్టుల్లో 10శాతం మాజీ అగ్నివీరులకు కేటాయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత సరిపోతుంది. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మొదటి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్లు, ఆ తర్వాతి బ్యాచుల వారికి మూడేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపునిస్తారు. ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషనరీ ఉంటుంది. వేతనం రూ. 21,700-69,100 ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని ఇతర వివరాలకు సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని హోంశాఖ సూచించింది.