హుజూరాబాద్, మార్చి 17: ఆ ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు తెలిపి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కానీ ఇంతలో తమ ఇళ్లలోని పెద్దలు తమ ప్రేమను అంగీకరించేమోనని అనుమానపడి భయపడ్డారు. అంతే కన్నోళ్లకు తమ ప్రేమను తెలుపకుండానే క్షణికావేశంతో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కలసి బతకలేనప్పుడు కలిసి చావునైనా పంచుకుందామని ఇద్దరూ రైలు కింద పడి మృతిచెందారు. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఈ దారుణ ఘటన జమ్మికుంట మండలంలో వెలుగు చూసుంది.
ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్ (18) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత (20) కరీంనగర్‌లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అంతే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల ఇద్దరూ ఈ విషయం ఇంట్లో తెలియజేసి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే రాహుల్.. శ్వేత కంటే చిన్నవాడు. దీంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో శ్వేత రాహుల్‌తో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ వెళ్లారు. అక్కడ కొంత సేపు ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చారో తెలియదుగానీ వెంటనే జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్దకు చేరుకున్నారు.
అక్కడ శనివారం రాత్రి ఇద్దరూ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన లోకో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.