నటుడు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌గా ఉన్న పోసాని కృష్ణ మురళి.. శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయనపై పెండింగు కేసులు ఏమీ లేకపోవడంతో నేరుగా ఆయన హైదరాబాద్‌లోని నివాసానికి వెళ్ల నున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై తీవ్ర దూషణలకు దిగారన్న కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వరుసగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పోసాని జైల్లోనే ఉన్నారు.
తొలుత ఫిబ్రవరి 27న కడప జిల్లా రాయచోటి పోలీసులు.. పోసానిపై కేసు నమోదు చేశారు. స్థానిక జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే.. అనేక నాటకీయ పరిణామాల అనంతరం.. పోసానిని అదుపులోకి తీసుకుని రాయచోటికి తరలించారు. అనంతరం.. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపైనే కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు మరో కేసు పెట్టారు. దీంతో ఆదోని పోలీసులు రాయచోటి నుంచి ఆయనను పీటీ వారెంటుపై రాయచోటి నుంచి ఆదోనికి తీసుకువచ్చారు. ఇక్కడ కొన్నాళ్లు జైల్లో ఉన్నారు.

ఇక, గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఇక్కడా కేసు నమోందైంది. దీంతో నరసరావు పేట పోలీసులు ఆయనను ఆదోని నుంచి తీసుకువచ్చి.. ఇక్కడ జైల్లో పెట్టారు. అనంతరం.. ఆయా కేసుల్లో బెయిల్ పొందిన పోసానికి చివరిలలో సీఐడీ అధికారుల నుంచి మరో కేసు ఎదురైంది. చంద్రబాబు ఫొటోలను మార్ఫింగ్ చేసి.. మీడియా ముందు ఆరోపణలు చేశారన్న కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని.. విచారించారు. దీంతో అప్పటి వరకు ఆయా కేసుల్లో బెయిల్ వచ్చినా.. బయటకు రాలేకపోయారు. సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన మరోసారి జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
తాజాగా శుక్రవారం సీఐడీ ప్రత్యేక కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తులు సమర్పించడంతో పాటు.. రెండు వారాలకు ఒకసారి సీఐడీ పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని.. షరతు విధించింది. అదేవిధంగా సీఐడీ పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని కూడా షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం.. పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా.. ఈ సమయంలో వైసీపీ కీలక నాయకుడు అంబటి రాంబాబు పోసానికి ఎదురేగి.. పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. అయితే.. పోసాని.. ముభావంగానే కారెక్కి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురికావడం.. గమనార్హం.