వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతుందా..? మరొక కీలక నేత ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీని వీడారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా చేరబోతున్నారట. వైసీపీని వీడుతున్నవారిలో ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉంటున్నారు.
కొద్ది రోజుల క్రితమే జగన్ సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీలు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు కూడా వారి బాటలోనే నడవబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీని వీడి త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారట.
1994లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తోట త్రిమూర్తులు.. 1995లో టీడీపీలో చేరారు. 1999లో ఆ పార్టీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో పి. సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయిన తోట.. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి.. 2009 ఎన్నికల్లో మళ్లీ ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యాక 2014 ఉపఎన్నికల్లో తోట సత్తా చాటారు.

రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ గూటికి చేరిన తోట త్రిమూర్తులు.. 2014 ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఓడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీని వీడి ఫ్యాన్ కిందకు చేరిన తోట త్రిమూర్తులు ఇప్పుడు గ్లాస్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పెద్దలతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారట. తన కుమారుడిని రాజకీయాల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయాలని తోట ఆశ పడుతున్నారు. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి తన కొడుకుకు రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అలాగే తన ఎమ్మెల్సీ పదవీకాలం మరో రెండున్నరేళ్లు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీని వీడితే.. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జనసేన అధినేతను తోట త్రిమూర్తులు కోరుతున్నారట. ఈ రెండు హామీలు వచ్చిన వెంటనే తోట వైసీపీని వీడి జనసేనలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఇటీవల జరిగిన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్‌తో కలిసి తోట ఫోటో దిగడంతో పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరింది.