– జిల్లాలో 14 చెరువులను గుర్తించిన అధికారులు
– కొత్తగా మట్టి పాలసీని తీసుక వచ్చిన కలెక్టర్
– నిఘా లేకుంటే ప్రభుత్వానికి భారీగా పడనున్న గండి
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మట్టి మాఫియా, ఇటుక బట్టీల యజమానుల కన్ను చెరువుల మట్టిపై పడింది. ఇటుకల తయారీ కోసం కావాల్సిన మట్టిని ఆయా చెరువుల నుంచి తరలించేందుకు అనుమతుల కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పెద్దపల్లి డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 14 చెరువుల్లో 3 లక్షల 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు అవకాశం ఉందని, అందులో అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా చెరువుల్లో నీళ్లు తగ్గిన తర్వాత అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు.
మట్టి మాఫియా, ఇటుక బట్టీల యజమానులు యేటా తక్కువ పరిమాణంలో అనుమతులు తీసుకుని పెద్ద ఎత్తున మట్టిని తోడుకు పోయి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జారీ చేసిన వే బిల్లుల ప్రకారమే మట్టిని పొద్దంతా తరలించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, అందుకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారు. దీనిపై పకడ్డందీగా నిఽఘా పెట్టాల్సిన ఆయా శాఖల అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా మట్టి మాఫియా, ఇటుక బట్టీల యజమానులు అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వే బిల్ లేకుండా మట్టిని తరలించకుండా ఉండేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష మట్టి పాలసీని తీసుక వచ్చారు. మట్టి తరలింపునకు తహసీల్దార్లు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. నీటి పారుదల, గనులు, భూగర్బ శాఖాధికారులు సూచించిన మేరకు మాత్రమే మట్టిని తీసుక వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి వాహనం వే బిల్లుతో వెళ్లే విధంగా రెవెన్యూ శాఖాధికారులు, పోలీసుల సహకారంతో పని చేయనున్నారు. వే బిల్లులను తహసీల్దార్లు జారీ చేయనున్నారు. సీనరేజీ డబ్బులు మాత్రం గనులు, భూగర్భ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఏ చెరువు నుంచి ఎక్కడికి మట్టిని తరలిస్తున్నారనే వివరాలను వే బిల్లులో పేర్కొనాలని, ఒక స్థలం రాసి, మరో చోటికి తరలిస్తే చర్యలు తీసుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టిని తరలించాలని, ఆ తర్వాత మట్టిని తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఫ గత ఏడాది నిబంధనలు అతిక్రమించి..
గత ఏడాది ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన ముర్మూరు చెరువు నుంచి నల్ల మట్టిని తీసుక వెళ్లేందుకు అనుమతులు పొందిన పలువురు ఇటుక బట్టీల యజమానులు నిబంధనలను అతిక్రమించి రాత్రింబవళ్లు మట్టిని తోడి ఒక చోట కుప్ప పోశారు. అనుమతులకు మించి మట్టిని తోడారని పలువురు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయడంతో విచారణ జరిపారు. 60 వేల మెట్రిక్ టన్నుల మట్టికి అనుమతులు తీసుకుంటే 20,280 మెట్రిక్ టన్నుల మట్టిని అదనంగా తోడినట్లు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై అనుమతులు పొందిన వారికి ఐదింతల పెనాల్టీలు విధిస్తే వన్ టైం సెటిల్‌మెంట్ ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి మట్టిని తీసుక వెళుతున్నారు. వాస్తవానికి అధికారులు గుర్తించినట్లుగా అదనంగా తోడిన మట్టి ఇంకా ఎక్కువగానే ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
పెద్దపల్లి మండలం కొత్తపల్లి చెరువులో ఆరు ఇటుక బట్టీలకు చెందిన యజమానులు 70,216 మెట్రిక్ టన్నుల మట్టి కోసం అనుమతులు తీసుకుని 95,294 టన్నుల మట్టిని అదనంగా తోడినట్లు నీటి పారుదల శాఖాధికారులు గుర్తించారు. చెరువు పక్కనే ఆ మట్టిని నిల్వ చేయగా, నెల రోజుల క్రితం గుట్టుచప్పుడుగా ఆ మట్టిని తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అదనంగా తోడుకు పోయిన మట్టికి పదింతలు సుమారు 38 లక్షల 56 వేల రూపాయల జరిమానా విధించారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రెండింతలు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆ డబ్బు ఇప్పటి వరకు బట్టీల యజమానులు చెల్లించక పోవడంతో గనులు, భూగర్భ శాఖాధికారులు సీజ్ చేశారు.
ఫ జిల్లాలో 14 చెరువుల గుర్తింపు..
ఈ యేడు చెరువుల్లో మట్టిని తరలించేందుకు అనుమతులు ఇచ్చేందుకు నాలుగు మండలాల్లో 14 చెరువులను గుర్తించారు. ఈ చెరువుల నుంచి 3 లక్షల 8 వేల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీసుక వెళ్లేందుకు అవకాశం ఉందని నీటి పారుదల శాఖాధికారులు గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి నక్కల ఒర్రె ప్రాజెక్టులో 40 వేల క్యూబిక్ మీటర్లు, పందిళ్ల పెద్ద చెరువులో 20 వేల క్యూబిక్ మీటర్లు, పెగడపల్లి పెద్ద చెరువులో 60 వేల క్యూబిక్ మీటర్లు, మంగపేట నల్ల చెరువులో 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, ధర్మారం మండలం ధర్మారం సీతల చెరువులో 30 వేల క్యూబిక్ మీటర్లు, సర్సింగాపూర్ చిన్న చెరువులో 40 వేల క్యూబిక్ మీటర్లు, దొంగతుర్తి పెద్ద చెరువులో 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ఉందని గుర్తించారు. జూలపల్లి మండలం తేలుకుంట రామప్ప చెరువులో 15 వేల క్యూబిక్ మీటర్లు, దారం చెరువులో 5 వేల క్యూబిక్ మీటర్లు, కాచాపూర్ ఇయ్యపు చెరువులో 10 వేల క్యూబిక్ మీటర్లు, కుమ్మరికుంటలోని పోచమ్మకుంటలో 5 వేల క్యూబిక్ మీటర్లు, ఓదెల మండలం కనగర్తి మెట్టిపల్లి చెరువులో 2 వేల క్యూబిక్ మీటర్లు, కొలనూర్ అలీమయ్య చెరువులో వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి తరలించుకు పోయేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చెరువుల్లో మట్టి తరలింపునకు ఇటుక బట్టీల యజమానుల పేరిట అనుమతులు పొందేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అప్పుడే యత్రాలు మొదలు పెట్టారు. ఏదీ ఏమైనా మట్టి తరలింపులో అధికారులు, అనుమతులు పొందిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తేనే అక్రమాలకు తావుండదు.
Updated Date – Apr 17 , 2025 | 01:32 AM