ABN
, Publish Date – Apr 13 , 2025 | 11:47 PM
రోడ్డు విస్తరణ చేశారు.. ఇక సమస్యలు ఉండవనుకున్న ప్రజలకు, వాహనదారులకు సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అసలు సమస్య ఏర్పడింది.

భూత్పూర్ చౌరస్తాలో నిలిచిన వర్షపు నీరు (ఫైల్)
– అధ్వానంగా సర్వీస్ రోడ్డు
– పట్టించుకోని జాతీయ రహదారి అధికారులు
– ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలు
భూత్పూర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు విస్తరణ చేశారు.. ఇక సమస్యలు ఉండవనుకున్న ప్రజలకు, వాహనదారులకు సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అసలు సమస్య ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. భూత్పూర్ చౌరస్తాలో 16 సంవత్సరాల క్రితం 44వ జాతీయ రహదారి విస్తరణలో చౌరస్తా చుట్టూ ప్రాంతాల్లో సర్వీసు రోడ్లుతో పాటు హైవే బ్రిడ్జీని ఏర్పాటు చేశారు. అయితే బ్రిడ్జీకి ఇరువైపులా సర్వీస్ రోడ్లను ఏటా మరమ్మతు చేయడంతో పాటు ఎక్కడైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి. కానీ ఇవేమీ పట్టించుకోకపోవడంతో సమస్యలు రోజురోజుకూ జటిలమవుతున్నాయి. గతంలో చైరస్తాలో బ్రిడ్జీ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతుండేవి. హైవే బ్రిడ్జీ ఏర్పడిన నాటి నుంచి ప్రమాదాలు తగ్గిపోగా, బ్రిడ్జీకి ఇరువైపులా ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్లు కొన్ని ప్రాంతాల్లో అధ్వానంగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు చౌరస్తా నుంచి 9వ వార్డు చివరి వరకు పూర్తిగా పాడైపోయింది. దీంతో ఇటు ప్రయాణికులు అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మార్లు స్థానికులు నేషనల్ హైవే అధికారులతో పాటు మునిసిపల్ అధికారులకు సమస్యను వివరించినా ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదిలా ఉంటే సర్వీసు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న డ్రైనేజీ కాల్వల దుస్థితి వర్ణాతీతం. చౌరస్తా సమీపంలో సర్వీసు రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాల్వలు ఏర్పాటు చేశారు. మురుగు నీరు బయటికి వెళ్లే మార్గం లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి భరించరాని దుర్గంధం వెదజల్లుతుండటంతో స్థానికులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రతీ ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. సంతలో చేపలు, మాంసం అమ్మేవారు వ్యర్థాలను మురుగు కాలువల్లో పారబోస్తుంటారు. అయితే అవి బయటికి వెళ్లే మార్గం లేక దుర్గంతో స్థానికులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఇక వానాకాలం వస్తే చౌరస్తా మొత్తం చెరువును తలపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
Updated Date – Apr 13 , 2025 | 11:47 PM