
తీపిగా.. భలే రుచిని కలిగి ఉండే మామిడి పండును చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ లాగించేస్తారు. అందుకే మామిడి పండును.. పండ్లలో రారాజు అని పిలుస్తారు. వేసవిలో లభించే ఈ మామిడి పండు ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీనిని పచ్చిగా.. పండుగా, అలాగే ఉడికించి తింటారు. దీనితోపాటు చాలా రుచికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు కూడా తయారు చేస్తారు. వీటిలో మామిడి షేక్ సర్వసాధారణం.. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని తాగడానికి ఇష్టపడతారు. పాలు, పండిన మామిడి పండ్లతో తయారు చేసిన మామిడి షేక్ వేసవిలో శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
మామిడిపండులో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కె మరియు బి6 వంటి పోషకాలు ఉన్నాయి.. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.. ఉదాహరణకు విటమిన్ ఎ కళ్ళకు చాలా మేలు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, వేసవిలో మామిడి షేక్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు..
అయితే.. మామిడి షేక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు ఏమిటి? అలాగే, ఏ వ్యక్తులు దీన్ని తాగకూడదు. నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ విషయాలను తెలుసుకుందాం.
మామిడికాయ షేక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. వేసవిలో మామిడి షేక్ తాగడం చాలా రుచికరంగా, చల్లగా ఉంటుందని చెప్పారు. అయితే దీనిని తాగడం వల్ల ప్రయోజనాలు – అప్రయోజనాలు రెండూ ఉన్నాయని అన్నారు. మామిడిలో విటమిన్ ఎ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పాలతో కలిపి చేసిన ఈ మ్యాంగో షేక్ మంచి శక్తి వనరుగా మారుతుంది.. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. వేడిలో అలసటను తగ్గిస్తుంది.
మామిడికాయ షేక్ ఎవరు తాగకూడదు?
మామిడి షేక్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. దీనితో పాటు, బరువు తగ్గాలనుకునే వారు మామిడి షేక్‌ను తక్కువ మొత్తంలో తాగాలి.. ఎందుకంటే ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. చాలా సార్లు ప్రజలు దీనికి ఎక్కువ చక్కెర కలుపుతారు.. దీంతో ఇది మరింత హానికరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా మ్యాంగో షేక్‌ను వైద్యుల సూచనలతో మాత్రమే తీసుకోవాలి..
నిపుణుల సలహా ఏంటంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకసారి చిన్న గ్లాసులో పరిమిత చక్కెరతో మామిడి షేక్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.. కానీ పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.. రక్తంలో చక్కెర స్థాయిలు మరింత దిగజారిపోవచ్చు. కాబట్టి, మీరు వేసవిలో ఖచ్చితంగా మామిడి షేక్ తాగాలి.. కానీ మీ శరీర అవసరానికి అనుగుణంగా సమతుల్య పరిమాణంలో మాత్రమే త్రాగాలన్న విషయాన్ని మరువొద్దు.. మీకు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..