
ఎండ ప్రభావంతో చర్మం కాంతి కోల్పోవడం, ముడతలు రావడం, మొటిమలు, నల్లని మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకు సన్‌స్క్రీన్ ఉపయోగపడుతుంది. దీనికి మీరు మీ చర్మ తత్వాన్ని అర్థం చేసుకుని సరైనది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చర్మ రకాన్ని బట్టి సరైన సన్‌స్క్రీన్ ఎలా ఎంపిక చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం సన్‌స్క్రీన్ ని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం.
పొడి చర్మం.. పొడి చర్మం ఉన్నవారు తేమను కాపాడే మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. క్రీమ్ బేస్డ్ ఫార్ములా, హైలురోనిక్ యాసిడ్, విటమిన్ E వంటి పోషకాలు కలిగి ఉండే సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం మంచిది. ఇవి చర్మానికి తేమను అందించడమే కాకుండా.. పొడిబారకుండా కాపాడతాయి. అదనంగా కోకో బట్టర్ లేదా ఆలోవెరా కలిగిన సన్‌స్క్రీన్‌లను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
జిడ్డు చర్మం.. జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత లేదా మ్యాట్ ఫినిష్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. నూనె లేని ఫార్ములా (Oil-Free, Non-Comedogenic) గల సన్‌స్క్రీన్ వాడటం ముఖంపై అదనపు నూనె పేరుకుపోకుండా చేస్తుంది. ఈ రకం సన్‌స్క్రీన్ మొటిమలు రాకుండా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.
సాధారణ చర్మం.. సాధారణ చర్మం ఉన్నవారు పెద్దగా సమస్యలు ఎదుర్కొనే అవసరం లేదు. వాటర్ బేస్డ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇందులో ఆలోవెరా, గ్రీన్ టీ వంటి సహజ సమ్మేళనాలు ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
మొటిమల సమస్య ఉన్న చర్మం.. మీరు మొటిమల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఆయిల్-ఫ్రీ, నాన్-కామెడోజెనిక్ ఫార్ములా ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. ముఖ్యంగా సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ వంటి పదార్థాలు కలిగిన సన్‌స్క్రీన్ మొటిమలను తగ్గించేందుకు సహాయపడతాయి.
సున్నితమైన చర్మం.. సున్నితమైన చర్మం ఉన్నవారు రసాయన మిశ్రమాలు లేని మినరల్ బేస్డ్ సన్‌స్క్రీన్‌ను వాడాలి. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ వంటి సహజ మినరల్స్ కలిగినవి అత్యంత ఉత్తమమైన ఎంపిక. ఇవి చర్మాన్ని ఎలాంటి హానీ కలిగించకుండా కాపాడతాయి.
SPF ఎంపిక ఎలా చేయాలి..? మీ చర్మ రక్షణ కోసం SPF 30 నుంచి SPF 50 వరకు ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. మీరు ఎక్కువసేపు బయట గడిపే వ్యక్తి అయితే SPF 50+ సన్‌స్క్రీన్ అవసరం.
సన్‌స్క్రీన్ లేదా ఏదైనా కొత్త స్కిన్‌కేర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయండి. అలర్జీ లేదా ఇతర సమస్యలు ఎదురైతే వెంటనే ఉపయోగించడం మానేయాలి. సన్‌స్క్రీన్ మాత్రమే కాకుండా.. చర్మాన్ని ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలి. స్కార్ఫ్ ధరించడం, నీరు అధికంగా తాగడం, ఎండకు ఎక్కువగా వెళ్లకుండా ఉండటం వంటివి కూడా ముఖ్యం.