ఏపీ సీఎం చంద్రబాబుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడు నాయకత్వ లక్షణాలతో ఉంటుందని, ప్రజలకు రాష్ట్రానికి ఏమి చేయాలనే ఆలోచనతో నిత్యం పరితపిస్తుంటారని చిరు ప్రశంసించారు.
రాజకీయాల్లో చంద్రబాబు, సినిమాల్లో తాను రాణించడానికి పాజిటివ్ మైండ్ సెట్, సానుకూల ఆలోచన విధానమే కారణమని అన్నారు. మహా నాయకుడిగా ఎదిగి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అటువంటి నాయకుల మైండ్ సెట్ మనందరికీ ఆదర్శం కావాలని అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్ సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు.

సీక్రెట్ అనే పుస్తకం తనకు ఎంతో నచ్చిందని, ఇప్పుడు ఈ పుస్తకం కూడా ఆ తరహాలో అందరికీ నచ్చుతుందని చిరు ఆశించారు. కష్టం వచ్చిన వెంటనే కృంగిపోకూడదని, నచ్చిన రంగంలో రాణించాలంటే సానుకూల దృక్పథంతో, పాజిటివ్ ఆలోచనలతో ఉండాలని చిరు సూచించారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నాటకాల్లో రాణించిన తాను హీరో అవుదామని అనుకున్నానని, కానీ కొందరు తనను అవహేళన చేశారని చిరు గుర్తుచేసుకున్నారు.
తన తల్లిదండ్రులు తనను ప్రోత్సహించారని, చదువు వదిలేసి సినిమాలే నా జీవితం అని ముందుకు వెళ్లానని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుని అందరితో వావ్ అనిపించుకున్నానని చెప్పారు. మన మైండ్ మనకు ఏది మంచిది అనేది చెబుతుందని, ధైర్యంగా ముందడుగు వేయాలని యువతకు సూచించారు.