
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో నిప్పుంటుకొని వస్తువులు, నగదు, నిత్యావసర సరుకులు దగ్ధమైన సంఘటన మండలంలోని రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల పూర్ లో మంగళవారం చోటు చేసుకొంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం గట్టుమల్లు, కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా కూతురు స్పందన మధ్యాహ్న సమయంలో సమీపంలోని తెలిసిన వారి ఇంటి వద్దకు వెళ్లింది. ఈ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో మంటలు అంటుకున్నాయి. గమనించిన వారు స్పందనకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల వారి సహాయంతో మంటలు ఆర్పడానికి నీరు చల్లారు. దీంతో ఇంట్లోని ఫ్రిజ్ పేలి మంటలు మరింతగా వ్యాపించి కొంత నగదు, ఇంట్లో సామగ్రి, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు గట్టుమల్లు తెలిపారు. ప్రభుత్వం ఆదు కోవాలని కోరారు.