– ప్రజల పక్షాన పోరాడే వారిని నిర్బంధించి ఉద్యమాలు ఆపలేరు : జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
– చలో హైదరాబాద్ గిరిజన సంక్షేమ భవన్ ముట్టడికి వెళ్లనీయకుండా ముందస్తు చర్యలు
– అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ-వైరాటౌన్
ప్రజల పక్షాన పోరాడే వారిని నిర్బంధించి ప్రజా ఉద్యమాలను ఆపలేరని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. గిరిజన ట్రైకర్ రుణాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ భవన్, హైదరాబాద్ ముట్టడి పిలుపునిచ్చింది. దాంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన భూక్యా వీరభద్రంను వైరా పోలీసులు సోమవారం తెల్లవారుజాము నుంచి గృహ నిర్బంధం చేసి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. మూడేండ్ల కింద 30 వేలమంది గిరిజనులకు మంజూరైన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. ఈ చర్య ద్వారా గిరిజన నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ఇందుకు నిరసనగా తలపెట్టిన చలో హైదరాబాద్ ప్రయత్నాన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులనుపయోగించి అక్రమంగా గృహనిర్బంధం చేసి అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన పోరాడే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం, నిర్బంధం ప్రయోగించడం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం కాపాడుతామని ఇచ్చిన మాటను నిర్బంధాల ద్వారా తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను, పోరాటాలను, అరెస్టులు, నిర్బంధాలతో అడ్డుకోలేరని, ప్రభుత్వంలో మార్పు రాకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. భూక్య వీరభద్రంను అక్రమ అరెస్టు, గృహనిర్బంధం చేయడాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా టౌన్, రూరల్ కార్యదర్శులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న భూక్యా వీరభద్రంను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, అమరనేని కృష్ణ సందర్శించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై ఆయన్ను విడుదల చేశారు.