గడ్డి పోచలు –

Written by RAJU

Published on:

గడ్డి పోచలు –‘గడ్డి పోచలు పేని/గట్టి ఏనుగునేని/ కట్టు వాడే జ్ఞాని’ అని ఆరుద్ర కూనలమ్మ పదాలులో అన్నారు. ఒక గొప్ప విషయాన్ని ఇంత చిన్న మాటలో అల్లిన ఆరుద్రని మనం గురువుగా భావించాలి. గడ్డిపోచ విడిగా ఒకటిగా వుంటే చాలా బలహీనంగా, గాలివాటుకు ఎటుపడితే అటు కొట్టుకు పోతుంది. ఆ గడ్డిపోచలకే బలం రావాలంటే వాటిని ఎవరో ఒకరు పేనాలి. అంటే బయట నుంచి సహాయం ఉండాలన్న మాట. నిజానికి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులను, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యాలు, సమాజంలోని ధనికవర్గాలు గడ్డిపోచల క్రింద తీసిపారేస్తుం టాయి. వారి మాన, ధన సమస్యలను సమస్యలుగానే గుర్తించవు.
కానీ, అన్ని సందర్భాలలో గడ్డిపోచలకు బలం తెప్పించటానికి జ్ఞానులు అవసరం ఉండకపోవచ్చు. వారి అనుభవాలే వారిని పెనవేసుకు పోయేటట్టు, బలంగా నిలబడేటట్టు చేస్తాయి. ఈ మధ్య విశాఖపట్నంలో జరిగిన డెలివరీ బారు సంఘటన మనకు మంచి ఉదాహరణ.
విశాఖపట్నం అంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పిడికిలెత్తిన నగరం. బంద్‌లు, రాస్తారోకోలతో సహా వివిధ పోరాట మార్గాలలో ఉక్కు కార్మికులను, విశాఖ ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చి ఏకదీక్షతో పోరాటం సాగిస్తున్న యూనియన్‌ ఉన్న నగరం అది. ధఢ సంకల్పంతో రెండు, మూడేండ్లుగా సాగుతున్న ఈ పోరాటం విశాఖ కార్మికులపై తప్పక ఉంటుంది.
ఈ నేపథ్యంలో డెలివరీ బారుపై ఆక్సిజన్‌ అపార్ట్‌మెంటులో జరిగిన అమానుష దాడి ఆ నగరంలో పనిచేస్తున్న డెలివరీ బార్సుకు ఎక్కడలేని ఆగ్రహం తెప్పించింది. ఆ అపార్ట్మెంట్‌లో బాగా డబ్బున్న వారు మాత్రమే ఫ్లాట్‌ కొనగలరు. ఆ ఆక్సిజన్‌ అపార్టుమెంటులో ఫుడ్‌ పార్సిల్‌ ఇవ్వటానికి వెళ్లిన డెలివరీ బారుని ఏ తప్పు లేకపోయినా కొట్టటమే కాక, సార్‌ అని పిలవనందుకు క్షమాపణ పత్రం రాయించుకుని గుడ్డలిప్పించి, రోడ్డు మీదకు గెంటటం డెలివరీ బార్సు అందరూ అది తమకు జరిగిన అవమానంగా భావించారు. దీనికి ప్రతిగా స్విగ్గీ, జోమాటో, ఉబర్‌, ఓలా ఇలా అన్ని కంపెనీల డెలివరీ బార్సు ఆక్సిజన్‌ అపార్ట్‌మెంట్‌ ఆర్డర్లను బారుకాట్‌ చేశారు. దానితో కదలిక వచ్చిన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ ఓనర్‌పై కేసు పెట్టింది. అతను తను చేసిన దానికి క్షమాపణ చెప్పాడు. గిగ్‌ వర్కర్స్‌కి తమ ఐకమత్యంలో ఉన్న బలమేమిటో తెలిసింది. ఐకమత్యం అంటే ఏమిటో కాదు, యూనియన్‌గా ఉండటం. తక్షణ సమస్యపై వచ్చిన ఈ ఐక్యతను శాశ్వతం చేసుకోవటానికి మరి అక్కడి డెలివరీ బార్సు యూనియన్‌ ఏర్పాటు చేసుకుంటున్నారో లేదో తెలియదు. యాదచ్ఛికంగా వచ్చిన ఈ ఐక్యత అన్ని వేళలా రాదు. ఇటువంటి ఐక్యతను శాశ్వతం చేయటానికి ఆరుద్ర చెప్పిన జ్ఞానుల అవసరం వుంది.
తమ బలం ఎక్కడుందో సరిగ్గా గ్రహించారు కనుకనే తమిళనాడులో శ్యామ్‌సంగ్‌ కార్మికులు యూనియన్‌ ఏర్పాటు చేసుకునే హక్కు కోసం 35 రోజులపాటు పట్టువదలక సుదీర్ఘపోరాటం చేసి విజయం సాధించారు.. యూనియన్లు ఉన్న చోట, యూనియన్లు లేనిచోట కార్మికుల పని పరిస్థితులు బేరీజు వేసుకుంటే యూనియన్లు ఉండటం ఎంత అవసరమో తేలుతుంది.
తెలంగాణాలో చట్టంలో ఉన్నాగాని, కనీస వేతనాలు సవరించటం జరగలేదు. అటువంటి వేతన సవరణ కోసం వేలాది ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు. అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ రెండూ ఈ విషయం గురించి పట్టించుకోవటం లేదు. ఆ పార్టీలకు ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాలలో ఫ్యాక్టరీ ఓనర్లు తప్ప కార్మికులు దష్టిలో ఉండరు. ఇటువంటి ప్రభుత్వాలకు కార్మికులు తమ బలం చూపి, చట్టం అవకాశం కల్పించిన జీతభత్యాల పెంపు, హక్కులను సాధించే యూనియన్లు ఉండాలి.
మీరు ఏ షాపింగ్‌ మాల్‌నైనా గమనించండి. అక్కడ మహిళా కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారు కూర్చోవటానికి అక్కడ స్టూల్లాంటివి కూడా ఉండవు. వారు రోజంతా-కస్టమర్స్‌ ఉన్నా, లేకున్నా-నిలబడే వుండాలి. అలా పనిచేయటం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. తమిళనాడు, కేరళలలో షాపింగ్‌ మాల్స్‌లో కార్మికులు కూర్చునే హక్కును సాధించారు. తెలంగాణాలో ఆ హక్కు లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెలంగాణాలో కూడా కార్మికులకు ఆ హక్కు కల్పిస్తానని అన్నది. అప్పుడు ప్రస్తావించటమే తప్ప, మళ్ళీ మరోసారి ఆ మాట ఎత్త లేదు. షాపింగ్‌ మాల్స్‌ కార్మికులకు యూనియన్‌ ఉంటే ఈ హక్కు ఎప్పుడో వచ్చేది కదా. ఇప్పుడు చూడండి ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి అడిగే కార్మిక నాయకుడు లేకుండా పోయాడు. ఇలాంటి సమస్యలు, యూనియన్లు పెట్టు కునే అవకాశానికి ప్రభుత్వం అడ్డంకులు కలిగించటంతో, అన్ని రంగాలలోనూ పేరుకుపోయాయి.
ఫ్యాక్టరీ లేదా ఒక సంస్థ ఉన్నది అంటే అక్కడ యూనియన్‌ ఉండాలి. ఆ యూనియన్‌లో ప్రతి కార్మికుడు సభ్యుడై ఉండాలి. ఆ యూనియన్‌ను నడిపే నాయకత్వం వుండాలి. ఆ నాయకత్వం కార్మికులలో కుల, మత, ప్రాంతీయ, లింగ బేధాలు తెచ్చే విచ్ఛిన్న శక్తుల ఆట కట్టించేటట్టు వుండాలి.
ఒకసారి ఢిల్లీలో ఆల్‌ ఇండియా పోటీలకు గణేష్‌ పాత్రో బందం రైలు ఎక్కింది. అప్పటికి నాటిక స్క్రిప్ట్‌ తయారు కాలేదు, రిహార్స్‌లు కాలేదు. అవన్నీ ఆ 24 గంటల రైలు ప్రయాణంలో పూర్తి చేసుకున్నారు. ఆ నాటిక పేరు ‘కొడుకు పుట్టాల’. ఆ నాటికకు జాతీయ అవార్డు వచ్చింది. దానిని గురించి చెపుతూ గణేష్‌ పాత్రో ఒక మాటంటాడు. 24 గంటలలో నాటిక రాయటం, రిహార్సులు వేయటం, స్టేజీ మీద ఆడటం, అవార్డు రావటం ఇవన్నీ యాక్సిడెంటలే అంటాడు. అలాటి యాక్సిడెంట్స్‌ జరగకూడదు అంటాడు. అలాగే కార్మికుల మధ్య ఐక్యత విశాఖపట్నంలో వచ్చినట్టు యాక్సిడెంటుగా రాకూడదు, యూనియన్‌ని నిర్మించాలి. కార్మికుల మధ్య ఐక్యతను ఆ విధంగా సాధించాలి. అప్పుడే దేశంలోని, శ్రమ జీవులలోని సగం సమస్యలు తీరుతాయి.
– కర్లపాలెం

Subscribe for notification
Verified by MonsterInsights