తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి చాలాకాలంగా విమర్శలకు తావిస్తోన్న సంగతి తెలిసిందే. స్థానిక టీడీపీ నేతలతో వివాదాలు మొదలు…అధికారాన్ని ప్రదర్శించే క్రమంలో పార్టీకి చెడ్డపేరు తెచ్చేవరకు కొలికపూడి చేరారు. ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనకు క్లాస్ పీకినా తీరు మారలేదు. ఈ క్రమంలోనే వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన కొలికపూడి శ్రీనివాసరావుకు చంద్రబాబు షాకిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించిన చంద్రబాబు..కొలికపూడిని పలకరించకుండా పక్కకు వెళ్లిన వైనం చర్చనీయాంశమైంది.
హెలీప్యాడ్ నుంచి దిగిన చంద్రబాబుకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నమస్కరించి స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే అందరినీ భుజం తట్టి చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. అయితే, కొలికపూడి దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు కాస్త ముభావంగా కనిపించారు. కొలికపూడి నమస్కరించినా చూసీచూడనట్లు చంద్రబాబు వెళ్లిపోయారు. అదే సమయంలో మహిళా నేతలు ముందుకు వచ్చి చంద్రబాబుకు అభివాదం చేయడంతో కొలికపూడి వెనక నిలబడిపోయారు. చంద్రబాబు దృష్టిని ఆకర్షించేందుకు కొలికపూడి ప్రయత్నించినా ఆయన పెద్దగా స్పందించకుండా ముందుకు సాగారు.

ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని కొలికపూడిపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ఇలా ప్రవర్తించారని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ టీడీపీ స్థానిక నేతలు పదేపదే చెబుతుండడంతో చంద్రబాబుకు కొలికపూడి పెద్ద సమస్యగా మారారు. మరి, ఇకనైనా చంద్రబాబును కలిసి కొలికపూడి తన తీరును మార్చుకుంటానని చెబుతారా లేక ఎప్పటిలాగే ఎక్కడైన నా తీరింతే…నచ్చకుంటే మీ ఖర్మంతే అంటూ పాతపాటే పాడతారా అన్నది తేలాల్సి ఉంది.