గన్ కల్చర్‌కు అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలమయ్యాడు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాను గన్ కల్చర్ పట్టి పీడిస్తోంది. మాస్ షూటింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన అమెరికా, ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోంది. అమెరికన్ల గన్‌కల్చర్‌కు ఆ దేశ పౌరులతోపాటు అక్కడ ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్నవారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు- రమాదేవి దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు.
వీరిలో కుమారుడు ప్రవీణ్ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్ మిల్వాంకిలో నివాసం ఉంటూ అక్కడి యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో.. ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరపగా.. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్ అక్కడికక్కడే మరణించడం కలకలం రేపింది. ప్రవీణ్ మరణవార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దాంతో.. ప్రవీణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ మృతితో కేశంపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మ రక్షణ నిమిత్తం తుపాకులు కొనుగోలు చేసుకునేందుకు అక్కడి పౌరులకు అమెరికా రాజ్యాంగం వెసులుబాటు కల్పించగా, కొందరు రెచ్చిపోయి వ్యవహరిస్తుండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.