వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని బైపాస్ రోడ్‌లో చోటు చేసుకుంది. ఓ కారును ఆపి సోదా చేస్తుండగా, డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైంది. హతురాలు ఎవరనేది ఆరా తీయగా, ముబారక్‌నగర్ ప్రాంతానికి చెందిన కమల(50)గా తేలింది. హత్య కేసు నమోదు చేసిన రూరల్ ఠాణా పోలీసులు, మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. కమలను ఎవరు, ఎందుకు హత్య చేశారనే దానిపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిచారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ తెలిసింది. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపిస్తోందనే కారణంతోనే కమలను హత్య చేసినట్లు పోలీసుల విచారణతో నిందితుడు రాజేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముబారక్‌నగర్‌కు చెందిన కమల కొందరు మహిళలతో వ్యభిచారం చేయిస్తుండేదని సమాచారం. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను కూడా ఈ రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన సదరు మహిళ కుమారుడు రాజేష్.. తన తల్లితో తప్పుడు పని చేయిస్తున్న కమలపై కక్ష కట్టాడు. ఈ నేపథ్యంలో కమలను కారులో ఎక్కించుకుని డిచ్‌పల్లి ఠాణా పరిధిలోకి తీసుకెళ్లి కల్లు తాగించిన అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం దొరకకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. మరి నిందితుడు చెప్పిన దాంట్లో నిజం ఉందా? లేదా హత్యకు మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.