– యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల మహాధర్నాలో వక్తలు
– సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ రెగ్యులర్ చేయాలని పలువురు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. నాయకులు డా.వేల్పుల కుమార్, డా.ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్‌ను నెరవేర్చడంలో గత పాలకపక్షం విఫలమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. రెగ్యులర్ చేసేవరకు ఐక్యంగా ఉద్యమించాలని, తమ సీపీఐ అండగా ఉంటుందని అన్నారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఆర్.కష్ణయ్య మాట్లాడుతూ.. మీకు న్యాయం జరిగే విధంగా తాను కొట్లాడుతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే ఎటువంటి చిక్కులూ రావని, కేంద్రంలో ఏదైనా మాట్లాడాల్సి వస్తే పార్లమెంట్‌లో తాను మాట్లాడుతానని అన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా ఉన్నదని, ఎటువంటి న్యాయపరమైన చిక్కులూ ఉండవని అన్నారు. శాసనమండలి మాజీ చైర్మెన్, ప్రస్తుత మండలి ప్రతిపక్ష నాయకులు డాక్టర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. లక్ష్యం నెరవేరే వరకు ఇదేవిధంగా ఉద్యమాన్ని కొనసాగించాలని, తమ వెంట తాముంటామని చెప్పారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ కోసం ఐక్యంగా ముందుకుపోవాలన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. 1990లో మొదలైన ఈ కాంట్రాక్టు వ్యవస్థ ఇప్పటికీ అనేక మంది జీవితాలను ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అందరినీ వన్ టైం సెటిల్మెంట్ కింద రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంగా పని చేయాలని కోరారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు అధ్యాపకులందరూ వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఆ డెలిగేషన్ ద్వారా ప్రభుత్వాన్ని కలవాలని సూచించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ సమస్యను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని, ఒక డెలిగేషన్‌ను తీసుకెళ్తానని చెప్పారు. బీజేపీ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు అనసూయ, నాయకులు సంధ్య, జేఏసీ నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరశురాం, డాక్టర్ విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలి

Written by RAJU
Published on: