కరీబియన్‌ బీచ్‌లో భారత సంతతి విద్యార్ధిని మిస్సింగ్‌.. రాకాసి అలలు మింగేశాయా?

Written by RAJU

Published on:

భారత సంతతికి చెందిన విద్యార్ధిని సుదీక్ష కోనంకి (20) ఉత్తర అమెరికాలో కనబడకుండా పోయింది. అక్కడి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న సుదీక్ష ఇటీవల వసంత సెలవు (spring holidays) ఇవ్వడంతో స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్‌కి వెళ్లింది. మార్చి 6న పుంటా కానాలోని రియు రిపబ్లికా హోటల్ బీచ్‌లో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత విద్యార్ధిని జాడ కానరాలేదు. సమాచారం అందుకున్న అక్కడి పోలీస్ యంత్రాంగం సుదీక్ష కోనంకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజా సమాచారం ప్రకారం బీచ్‌లోని రాకాసి అలల వల్ల సుదీక్ష ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతై ఉండవచ్చని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు మీడియాకు తెలిపారు. ఎందుకంటే.. సుదీక్ష మిస్సింగ్‌కి ముందు రోజు మరో ఆరుగురి స్నేహితులతో బీచ్‌లో కనిపించిందని, అయితే మిగిలిన వారంతా రిసార్ట్‌కి తిరిగి వెళ్లగా సుదీక్ష మాత్రం మరో వ్యక్తితో బీచ్‌లోనే ఉండిపోయిందని తెలిపారు. వీరిద్దరూ బీచ్‌లో ఈతకు వెళ్లినప్పుడు పెద్ద అలల్లో చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సుదీక్షతోపాటు ఆమె స్నేహితుడి ఆచూకీ కూడా లభ్యంకాకపోవడంతో పోలీసులు ఈ మేరకు అనుమానిస్తున్నారు.

భారత్‌కు చెందిన సుదీక్ష తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. వర్జీనియా నగరంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో సుదీక్ష గ్రాడ్యుయేషన్‌ చదువుతోంది. అయితే లౌడౌన్ కౌంటీలోని షెరీఫ్ కార్యాలయం… ఆమె ఈ నెల 6న పిట్స్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన మరో ఐదుగురు మహిళా స్నేహితులతో కలిసి బీచ్ రిసార్ట్‌కి వెళ్లినట్లు తెలిపింది. మార్చి 6న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సుదీక్ష కనిపించడం లేదని ఆమె స్నేహితులు ఫిర్యాదు చేసినట్లు రియు రిపబ్లికా హోటల్ యాజమన్యం తెలిపారు. సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోనంకి కూడా తన కుమార్తె మార్చి 6న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి బీచ్‌కి వెళ్లిందని మీడియాకు తెలిపారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ కొంత సమయం తర్వాత ఆమె స్నేహితులు తిరిగి వచ్చారని, తమ కుమార్తె మాత్రం బీచ్‌ నుంచి తిరిగి రాలేదని తెలిపారు. డొమినికన్ రిపబ్లిక్‌లోని పోలీస్‌ అధికారులు అక్కడి బీచ్‌లో హెలికాప్టర్లు, ఇతర సాధనాలను ఉపయోగించి బీచ్‌ జలాల్లో తీవ్రంగా గాలించారని, బీచ్‌లోని పొదలు, చెట్ల దగ్గర కూడా శోధించారని తెలిపారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదని, అధికారులు తన కుమార్తె కోసం నీటిలో, రిసార్ట్ చుట్టుపక్కల వెతకడానికి బదులుగా.. కిడ్నాప్, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ సహా ఇతర కోణాల్లో ఎందుకు గాలించడం లేదని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు ప్రశ్నించారు.

మరోవైపు డొమినికన్ రిపబ్లిక్‌లోని భారత రాయబార కార్యాలయం సుదీక్ష తల్లిదండ్రులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని, తప్పిపోయిన విద్యార్థిని గుర్తించడంలో అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. ఆమెను కనుగొని సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification