– 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు
– 164 ఎకరాల్లో సభాస్థలి, 1,200 ఎకరాల్లో పార్కింగ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 25 ఏండ్ల వార్షికోత్సవ సభను అత్యంత భారీ ఎత్తున నిర్వహించబోతుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో జరిగే రజతోత్సవ సభకు 10 లక్షల మంది ప్రజలను సమీకరించి తమ సత్తాచాటుతామని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. 164 ఎకరాల్లో భారీ బహిరంగసభ వేదిక, మరో 1,200 ఎకరాల్లో ఐదు జోన్‌లలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రజల సమీకరణకు సుమారు 50 వేల వాహనాలకుపైగా సమకూర్చుతున్నారు. ఎండలు అధికంగా ఉండటంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు.
టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారినా పార్టీ ఏర్పడి 25 ఏండ్లయిన సందర్భంగా రజతోత్సవ సభ చారిత్రాత్మక సభగా మలచడానికి పార్టీ నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ బహిరంగసభ చారిత్రాత్మక సభగా నిలిచిపోవాలంటే భారీ జన సమీకరణే కాదు.. పార్టీ నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిర్ణయం కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.. అది ఏమిటనేది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే ప్రతిపాదన కూడా ఈ సభలో చర్చకు పెట్టబోతున్నారన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌గా ఉన్నప్పుడు పార్టీ భారీ విజయాలు సాధించిందని, బీఆర్‌ఎస్‌గా మార్చడం పట్ల ప్రజల్లోనూ అంత స్పందన రాలేదన్న భావన గులాబీ నేతల్లో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో డివిజన్లు, వార్డులవారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుతున్నారు. ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున సమీకరించాలని పార్టీ నాయకత్వం సూచించడంతో ఆ దిశగా క్షేత్రస్థాయిలో నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మహిళలందరినీ ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు.
సూర్యాపేట నుంచి ప్రభ బండ్లు..
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట నుంచి 100 ప్రభ బండ్లు సభాస్థలికి ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ప్రభ బండ్లు రజతోత్సవ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
‘పోచంపల్లి’, ‘దాస్యం’, ‘పెద్ది’ నేతృత్వంలో ఏర్పాట్లు
రజతోత్సవ సభకు సంబంధించిన సభాస్థలి, పార్కింగ్ జోన్‌లతోపాటు అన్ని ఏర్పాట్లు మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్ సమన్వయంతో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతు న్నాయి. వీరంతా ఎల్కతుర్తిలోనే మకాం వేసి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సభాస్థలిని సందర్శించిన కేటీఆర్, కవిత
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి నేతలు దఫదఫాలుగా విచ్చేసి పనులను పరిశీలించి వెళ్తున్నారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు సభాస్థలిని సందర్శించారు.

ఓరుగల్లు గులాబీమయం

Written by RAJU
Published on: