ఓయూలో ఆంక్షలు ఎత్తేయాలి

Written by RAJU

Published on:

ఓయూలో ఆంక్షలు ఎత్తేయాలి– ప్రజాస్వామిక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఓయూ రిజిస్ట్రార్‌ అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా తెచ్చిన సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యార్థి, ప్రజా పోరాటాలకు ఓయూ కేంద్రమని తెలిపారు. విద్యార్థులు హక్కుల కోసమే కాకుండా క్యాంపస్‌ వెలుపల జరిగే పోరాటాలకూ వెన్నుదన్నుగా నిలుస్తారుని వివరించారు. వందేమాతరం ఉద్యమం మొదలు తెలంగాణ ఉద్యమం వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రబిందువుగా ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చిందని తెలిపారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ అని ప్రకటించిందని వివరించారు. ఇప్పుడు నియంతృత్వ విధానాన్ని అవలంభిస్తున్నదని విమర్శించారు. ప్రగతి భవన్‌ కంచెలు తొలగించిన కాంగ్రెస్‌ ఓయూలో నినాదాలు, పోరాటాలు, ధర్నాలు చేయొద్దంటూ సర్క్యులర్‌ను జారీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికం, అనైతికం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మెస్‌ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ మరమ్మతులు, పెండింగ్‌లో ఫెలోషిప్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఓయూ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నూతన భవనాల నిర్మాణం, రెగ్యులర్‌ కోర్సులు కాకుండా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల పేరుతో వేలాది రూపాయల ఫీజుల పెంపు భారాలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
వాటి గురించి మాట్లాడకుండా విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజాపాలన పేరుతో నియంతృత్వ విధానాన్ని అమలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఓయూ రిజిస్ట్రార్‌ ఇచ్చిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్‌ : ఏఐఎస్‌ఎఫ్‌
ఓయూలో నిరసనలు, ధర్నాలు, ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించొద్దంటూ వీసీ, రిజిస్ట్రార్‌ విడుదల చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి ఉద్యమాలను అణచివేస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజాపాలన అంటూ ప్రజాస్వామిక హక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు.
వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్‌ సర్కారు : పీఎస్‌యూ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, కార్యదర్శి కోట ఆనందరావు విమర్శించారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. ఓయూతోపాటు ఇతర వర్సిటీల్లో విద్యార్థి సంఘాల కార్యక్రమాలపై ఆంక్షలను ఎత్తేయాలని కోరారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలని తెలిపారు. వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. వసతుల కల్పన కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని తెలిపారు.

Subscribe for notification