ఒయూలో ఆంక్షలంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : కేటీఆర్‌ –

Written by RAJU

Published on:

ఒయూలో ఆంక్షలంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : కేటీఆర్‌ –నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్‌ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శించారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మ్యానిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్‌ లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదని అల్టిమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తున్నదని తెలిపారు. విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన సంఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని చెప్పారు. అలాంటి దారుణాలు పునరావృ తం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపట్ల కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Subscribe for notification