ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌లో ఒమేగా-3 ఉంటుంది అంటారు. ఈ ఒమేగా-3 వలన ఉపయోగాలేమిటి? అన్ని వయసులవారు వీటిని వేసుకోవచ్చా?
– భానుసత్యం, హైదరాబాద్
ఒమేగా-3 సప్లిమెంట్స్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరచి, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో, జాయింట్ల నొప్పులను తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
అలాగే గర్భిణుల్లో పిండం అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. ఒమేగా-3 అనేది సహజంగా చేప నూనెలో, విత్తనాల్లో, గింజలలో లభిస్తుంది, కానీ ఆహారంతో సరిపోనప్పుడు సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం అవసరం. ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. వైద్యుల సూచన మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.
నా వయసు 50 ఏళ్ళు. అప్పుడప్పుడు పిక్కల నుంచి అరికాలు దాకా లాగినట్టుగా నొప్పి ఉంటుంది. ఏమైనా పోషకాల లోపమా?
– సతీష్, విజయవాడ
సమయానుసారం ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలికంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, కొన్నిరకాల పోషక లోపాలు ఉండడం మొదలైన కారణాల వల్ల ఇలా కాళ్ళు లాగినట్టు ఉంటుంది. ఆహారంలో ప్రొటీన్లు తగినన్ని లేనప్పుడు కండరాల్లో తగినంత శక్తి ఉండదు. అటువంటప్పుడు కాళ్ళ నొప్పులు రావడం, నీరసంగా అనిపించడం జరుగుతుంది. ప్రొటీన్ల కొరకు మాంసాహారులైతే చికెన్, చేప, గుడ్లు మొదలైనవి తరచూ తీసుకోవాలి. శాకాహారులు పాలు, పాల పదార్థాలు, సెనగలు, రాజ్మా, అలసందలు, సోయా చిక్కుడు గింజల వంటివి తప్పనిసరిగా ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. డీ విటమిన్ తగ్గినపుడు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. తగినంత డీ విటమిన్ ఉత్పత్తి కావాలంటే రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు ఎండలో గడపాలి. రక్త పరీక్షల ద్వారా శరీరంలో విటమిన్ డీ స్థాయి తెలుసుకొని వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు కూడా వాడాల్సి రావొచ్చు. మెగ్నీషియం అధికంగా ఉండే ముడిధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకోవాలి.
‘సర్వైకల్ స్పాండిలోసిస్’ ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
– లావణ్య, కర్నూలు
వయసుతో పాటుగా ఎముకలు, కీళ్లలో మార్పులు వస్తాయి. వెన్నెముక పైభాగం వద్ద ఉండే కీళ్లు, డిస్క్‌లలో అరుగుదల వల్ల ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ వస్తుంది. అరవయ్యేళ్లు దాటినవారిలో అధికంగా ఈ సమస్య ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నప్పటికీ చాలామందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా సాధారణ జీవితం గడుపుతారు. అధిక బరువు, పొగ త్రాగడం వలన కూడా ఈ సమస్య తాలూకు లక్షణాలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకమైన ఆహారం ఉండదు కానీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో వాపు, నొప్పి కొంతవరకు నియంత్రణలో ఉంటుంది. వాపు ఎదుర్కొనేందుకు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వివిధ రకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ప్రతి రోజూ తీసుకోవాలి. బాదాం, ఆక్రోట్, పల్లీ, అవిసె వంటి గింజల్లో ఉండే ‘విటమిన్ ఈ’, మంచి ఫ్యాటీ యాసిడ్స్ కూడా వాపును, నొప్పిని ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. సమయానికి
ఆహారం తీసుకోవడం, నొప్పికి తగ్గ చికిత్స పొందుతూ వైద్యుల సలహా మేరకు చేయగలిగిన వ్యాయామాలు చేయడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com