వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఆటతీరు ద్వారా చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్, తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. కానీ విరాట్ కోహ్లీ ముందు వారి ప్రణాళికలు పనిచేయలేదు. ఆర్‌సిబి తరఫున విరాట్ అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతడు దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాలను నిర్మించాడు.
కోహ్లీ తన సీజన్‌లో తొలి సెంచరీ సాధించే దిశగా సాగుతుండగా, హార్దిక్ పాండ్యా ఆట దిశను పూర్తిగా మార్చేశాడు. రెండవ ఓవర్‌కు వచ్చిన హార్దిక్, కోహ్లీని ఫీల్డర్ నమన్ ధీర్ సహకారంతో అవుట్ చేసి కీలక బ్రేక్ త్రు ఇచ్చాడు. అదే ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను డకౌట్ చేసి, ఒక అరుదైన రికార్డు కూడా నమోదు చేశాడు. ఆ వికెట్‌తో హార్దిక్ తన టీ20 కెరీర్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు అతను ఇప్పటివరకు 5000కి పైగా పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు. 5000+ పరుగులు, 200+ వికెట్లు తీసిన మొదటి భారతీయుడిగా హార్దిక్ నిలవడం అతని కెరీర్‌లో గర్వించదగిన ఘనతగా మారింది. మొత్తం ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా హార్దిక్ పేరు నమోదైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బెంగళూరు బ్యాటర్లు ముంబై బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. కోహ్లీ, పాటిదార్, పడిక్కల్ చివర్లో జితేష్ శర్మ కలసి ఎంఐ బౌలర్లపై చెలరేగిపోయారు. జితేష్ 19 బంతుల్లో 40 పరుగులు చేయడం ముంబైపై పెనుదెబ్బగా మారింది. బుమ్రా మాత్రం తన ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి మళ్లీ తన నాణ్యతను ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు తీసినప్పటికీ, అతని స్పెల్‌తో స్కోరును నియంత్రించలేకపోయాడు. మొత్తంగా RCB 221/5 పరుగులతో భారీ స్కోరు చేసింది. పవర్‌ప్లేలో 73/1, మిడిల్ ఓవర్లలో 78/3, డెత్ ఓవర్లలో 70/2 తో పూర్తి ప్రణాళికతో ఆడి మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తీసిన అరుదైన ఫీట్‌తో పాటు కోహ్లీ వికెట్ ద్వారా ముమెంటం తిరగబడినా, మొత్తంగా బెంగళూరు జట్టే విజయం వైపు బలంగా సాగింది. కానీ, హార్దిక్ పాండ్యా టీ20లో 5000+ పరుగులు, 200 వికెట్లు తీసిన అరుదైన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇది అతని కెరీర్‌లో ఓ గొప్ప మైలురాయిగా నిలవనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..