– కంచ గచ్చిబౌలి భూముల వివాదం విషయంలో..
– ఏఐ ఫొటోను రీపోస్ట్ చేసిన అధికారి
– బీఎన్‌ఎస్ 179 కింద నోటీసులు జారీ
నవతెలంగాణ-మియాపూర్
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌కు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదం విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోను రీ పోస్టు చేసినందుకు ఈ నెల 12వ తేదీన నోటీసులు జారీ చేసినప్పటికీ ఈ విషయంపై వెలుగులోకి రాలేదు. అయితే బుధవారం మరోసారి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలి సర్వేనెంబర్ 25లోని 400 ఎకరాల భూమి విషయంలో పూర్తిగా తమ వాదనను ప్రజల ముందు వినిపించేందుకు సిద్ధమైంది. ఈ భూముల వివాదంలో కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారనే విషయంలో ప్రభుత్వం ఇటీవలే హైకోర్టుకు వెళ్లింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం కోసం కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంది. అందులో భాగంగా కంచె గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన ఏఐ ఫొటోలను స్మిత సబర్వాల్ సోషల్‌మీడియాలో షేర్‌చేయడంతో నోటీసులు అందజేసినట్టు పోలీసులు తెలిపారు. బీఎన్‌ఎస్ 179 కింద నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలిపేందుకు గచ్చిబౌలి పోలీసులు నిరాకరించారు.

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు

Written by RAJU
Published on: