– పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, వికలాంగుల వాయిస్ మాస పత్రిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల చట్టాల అమలు-అనుభవాలు అనే అంశంపై రాష్ట్ర సదస్సును ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. అంతర్జాతీయ అటిజం అవేరేనెస్ దినోత్సవం ఏప్రిల్ 2 సందర్బంగా నిర్వహిస్తున్న సదస్సు పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య మాట్లాడుతూ వికలాంగులు పోరాడి సాధించుకున్న చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. చట్టాల అమలును పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు వికలాంగులకు అందుబాటులోకి రాలేదనీ, తీవ్రవైకల్యం కలిగిన వారికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలనే సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పట్టించుకోవడం లేదన్నారు. 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమల్లోకి వచ్చినా మానసిక వికలాంగులకు భరోసా కల్పించలేదని చెప్పారు. మానసిక వికలాంగుల సంరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని చట్టంలో ఉన్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 1999 నేషనల్ ట్రస్ట్లో అటిజం, సెరిబ్రాల్ పాల్సి, బుద్దిమాంద్యత, బహుళవైకల్యం కలిగిన వికలాంగుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్న అమలు కావడం లేదన్నారు. ఐక్యరాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. వికలాంగుల చట్టాల అమలుపై జరుగుతున్న రాష్ట్ర సదస్సుకు వికలాంగులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి. శశికల, డీవైఎప్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో వికలాంగుల చట్టాల అమలు – అనుభవాలు అనే అంశంపై రాష్ట్ర సదస్సు

Written by RAJU
Published on: