
అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తే ఇది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
మార్చి 12 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడమే మంచిదని ఒక కొడుకుగా తన అభిప్రాయమని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని ఆయన అన్నారు. వాళ్ల పిచ్చి మాటలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమని కేటీఆర్ వివరించారు.
బీఆర్‌ఎస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు వరంగల్ అనువైన ప్రాంతమని కేటీఆర్ చెప్పారు. అన్ని రకాల రవాణా సదుపాయం ఉందని అన్నారు. ప్లీనరీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున రెండు సభలు పెడితే ఇబ్బంది అని భావించామని అన్నారు.