ఎంపీ ఇల్లు అని తెలియదు.. –

Written by RAJU

Published on:

ఎంపీ ఇల్లు అని తెలియదు.. –– ఎంపీ డీకె అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు : వివరాలు వెల్లడించిన డీసీపీ విజయ్ కుమార్‌
నవతెలంగాణ – బంజారా హిల్స్‌
జూబ్లీహిల్స్‌లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి చొరబడిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజరు కుమార్‌ వివరాలు వెల్లడించారు. నిందితుడికి అది ఎంపీ ఇల్లు అని తెలియదని, అతనిపై ఢిల్లీలో 30కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీసులతో కలిసి వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించినట్టు వెల్లడించారు.
గత ఆదివారం ఉదయం ఎంపీ డికె.అరుణ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి గంటన్నర ఉన్నాడని తెలిపారు. సీసీ కెమెరా వైర్లు కట్‌ చేసి లోనికి వెళ్లాడన్నారు. ఇది మహానగరంలోని ఒక ముఖ్యమైన హిల్స్‌ ఏరియా, ఎంపీ ఇంట్లో జరిగిన విషయం కాబట్టి కేసును సీరియస్‌గా తీసుకున్నట్టు చెప్పారు. కేసు కోసం ప్రత్యేకంగా 8 టీములను ఏర్పాటు చేసి సాంకేతికతను వినియోగించి సీసీ కెమరాలను పరిశీలించినట్టు చెప్పారు. ఇంట్లో పని చేసే వారిని కూడా విచారించమన్నారు. సీసీ కెమెరాలు చెక్‌ చేసినప్పుడు ఒక వ్యక్తి పాతబస్తీ తలాబ్‌ కట్ట నుంచి డికె. అరుణ ఇంటికి వచ్చి మళ్లీ అదే ఏరియాకి వెళ్లిపోయినట్టు గుర్తించామని తెలిపారు. అతన్ని ఢిల్లీకి చెందిన మహమ్మద్‌ అక్రమ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అతను టైల్స్‌ షాప్‌లో పని చేస్తాడన్నారు. గత ఫిబ్రవరి నెలలో హైదారాబాద్‌కు వచ్చిన అక్రమ్‌ ఒక పెద్ద ఇంట్లో దొంగతనం చేసి ఢిల్లీ వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ టెంపుల్‌ వద్దకు ఆటోలో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఏరియాను సర్వే చేశాడన్నారు. రాత్రి సమయంలో ఆ ఏరియాలో తిరుగుతూ ఒక ఇంటి నుంచి ఒక ఇంటి పైకి వెళ్లిన నిందితుడు ఎంపీ డికె.అరుణ ఇంట్లోకి కిటికీ ద్వారా ప్రవేశించాడని తెలిపారు. సీసీ కెమెరాలు ఉండటంతో వైర్లను కట్‌ చేసి లోపలికి ప్రవేశించాడన్నారు. అయితే అక్కడ డబ్బుల కోసం వెతికినా అతనికి దొరకలేదన్నారు. కొంత సేపటికి బయట పడుకున్న వారు కదులుతున్నట్టు అనిపించడంతో కిటికీ నుంచి బయటికి వచ్చి ఆటోలో పారిపోయాడన్నారు. నిందితుడు ఢిల్లీలో చేసిన చోరీ కేసులో తీహార్‌ జైలుకు వెళ్లాడని, మళ్లీ ఢిల్లీలో చోరీ చేస్తే దొరికిపోతానని హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలిసిందని చెప్పారు. అది ఎంపీ ఇల్లు అని అక్రమ్‌కు తెలియదన్నారు.
నగరంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచాల్సి ఉందని, సీసీ కెమెరాలను కూడా ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 8 పోలీస్‌ బృందాలు గాలించి నిందితున్ని పట్టుకున్నాయన్నారు. డబ్బులు మాత్రమే చోరీ చేసే అలవాటున్న అక్రమ్‌ అవి దొరక్కపోవడంతో పారిపోయాడని.. అక్కడే అతను తమకు క్లూ ఇచ్చాడని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్‌ టీమ్‌లను అభినందిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.

Subscribe for notification