ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలి

Written by RAJU

Published on:

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలి– అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు నిలబడాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఎయిప్సో) పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో సంఘం కార్యాలయం వద్ద నాయకులు ఫహల్గాం వద్ద టెర్రరిస్టుల దాడిని ఖండిస్తూ, మరణించిన వారికి నివాళి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐఏఎల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్‌, ఎయిప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేపీఎల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు జి.నాగేశ్వరరావు, కాచం సత్యనారాయణ మాట్లాడారు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరమనీ, దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రగతిని, మానవ హక్కులను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తున్నారనీ, వీటికి అడ్డుకట్ట వేసేందుకు పాలకులు అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కెవిఎల్‌ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యానికి అవసరమైన ఆధునిక ఆయుధాలను, అవసరమైన సైనిక పోస్టుల భర్తీ, వసతుల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. ఉగ్రవాదం అంతంతో పాటు ప్రపంచశాంతి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతి సంఘం నాయకులు రామరాజు రవి కిషోర్‌, జె.కె.శ్రీనివాస్‌, ఇరుగు శ్రీధర్‌, నరేంద్ర ప్రసాద్‌ సుధావన్‌, జాదవ్‌ రజాక్‌, హర్షద్‌ అహ్మద్‌, పుష్పలత, వి.రాజి రెడ్డి , నక్క కృష్ణ గౌడ్‌, సిహెచ్‌. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights