అభద్రతా భావం.. ఇన్ సెక్యూరిటీ అని కూడా పిలుస్తారు. ఇది బయటకు కనిపించని ఒక రుగ్మత. దీని కారణంగా బాధపడేవారి కన్నా వారి చుట్టూ ఉన్నవారే ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. ఎవరి నైపుణ్యాలు వారివే. ఎవరి తెలివితేటలు, సామర్థ్యాలు వారివే. ఎవరైతే తమలో ఉన్న స్పెషాలిటీని గుర్తిస్తారో వారే సక్సెస్ ను త్వరగా అందుకుంటారు. కానీ ఈ ఇన్ సెక్యూరిటీ సమస్య ఉన్నవారు కాస్త భిన్నంగా ఉంటారు. ప్రతి విషయంలో ఎదుటివారితో తమను తాము పోల్చుకుంటూ కుంగిపోతారు. అందుకే ఇదొక వెరైటీ సమస్య. వినడానికి ఇది చాలా సిల్లీగా అనిపించినప్పటికీ అభద్రతా భావం వల్ల కలిగే దుష్ఫలితాలు అంత మంచివి కావు. వీటిని పరిష్కరించకుండా వదిలేస్తే వీరి చుట్టూ ఉన్నవారికి కూడా ఎన్నో ఇబ్బందులు తప్పవు. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి..
అన్నింటికీ ముందు మీరే సారీ చెప్తున్నారా…
చాలా చిన్న విషయానికి మీరు నిరంతరం క్షమాపణలు కోరుతున్నారా? మీ తప్పును గ్రహించడం మంచిదే అయినప్పటికీ, అయినదానికి కాని దానికి ముందుగా మీరే సారీ చెప్పేయడం మీలో చాలా అభద్రతా భావాన్ని సూచిస్తుంది. మీరు లో కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఎదుటివారికి తెలియజేస్తుంది. ఈ ప్రవర్తన అంత మంచిది కాదని.. రిజెక్షన్ కు భయపడి ముందే మీరు దాని నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తుంటారని అని వైద్యులు అంటున్నారు.
మార్పుకు భయపడుతున్నారా..
ఉద్యోగంలో అయినా, వ్యక్తిగత సంబంధాలలో అయినా, మీరు సవాలుతో కూడిన రోల్ ను తీసుకోవడానికి వెనుకాడతారా? ఆ సవాలును స్వీకరించడానికి విజేతగా ఎదగడానికి మీరు తగినంతగా సిద్ధంగా లేరని భావించడం వల్ల మీరు అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు మార్పుకు కూడా భయపడవచ్చు, అందువల్ల, కొత్త పనులు స్వీకరించడానికి రిస్క్ చేయలేరు.
ఎవరైనా పొగిడినప్పుడు ఇలా అనకండి..
మీరు వంట చాలా బాగా చేశారు.. మీరు చూడ్డానికి చాలా బాగున్నారు అనే కాంప్లిమెంట్స్ లాంటివి ఎదురైనప్పుడు లేదా మీ పనిగురించి పొగిడినప్పుడు మీరెలా స్పందిస్తున్నారు.. నేను నమ్మను.. పొగిడింది చాల్లే, నాకంత సీన్ లేదులే.. ఇలాంటి పదాలు మీ నోటి నుంచి వస్తున్నాయా? అయితే మీలో ఇన్ సెక్యూరిటీ ఉన్నట్టే. వీటికి బదులుగా సింపుల్ గా థాంక్యూ అని హుందాగా ఆ కాంప్లిమెంట్ ను స్వీకరించలేకపోతుంటారు. ఎందుకంటే ముందు మీలో ఉన్న మంచి విషయాలను మీరే నమ్మడానికి సిద్ధంగా ఉండరు. అది నలుగురిలో మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం అవుతుంది.
అందరినీ ప్లీజింగ్ చేసే పని మీది కాదు..
చాలా మంది అందరిలో మంచివారిగా ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటారు. మనల్ని ఇష్టపడని వారి పట్ల కూడా వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది కచ్చితంగా మీలో పాతుకుపోయిన అభద్రతా భావానికి పరాకాష్టగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకన్నా ముందు ఎదుటివారి సంతోషమే ముఖ్యమని అనుకోవడం వల్ల మీకేమీ బిరుదులు లభించవు. వారి కోసం మిమ్మల్ని మీరు ఇబ్బందిపెట్టుకోవడం కరెక్ట్ కాదు.
అసూయ పడుతున్నారా..
ఎవరిలోనైనా కొంత అసూయ సర్వసాధారణం. మీరు చాలా అసూయపడే వ్యక్తి అయితే, అది మిమ్మల్ని జీవితంలో అభద్రతా భావానికి గురిచేసిన గత సంఘటన నుండి పుట్టుకొచ్చి ఉండొచ్చు. ఇది అతిగా విశ్లేషించడం, అతిగా ఆలోచించడం, ఇతరులను కంట్రోల్ చేయడం, ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో వ్యక్తమవుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై మీరు నమ్మకాన్ని కోల్పోవడం వల్ల కూడా మిమ్మలని మీరు నమ్మలేరు.