ఇందిరాగిరి సోలార్‌ జల వికాసం వేగవంతం చేయండి

Written by RAJU

Published on:

ఇందిరాగిరి సోలార్‌ జల వికాసం వేగవంతం చేయండి– అడవులు, గిరిజనుల ఆదాయం పెంచడమే పథకం లక్ష్యం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇందిరాగిరి సోలార్‌ జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల ఖరారులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అడవులను పెంచుతూనే, గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ పథకానికి రూ.12,500 కోట్లు వెచ్చించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వము గిరిజనుల వ్యవసాయ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో నిధులు కేటాయించలేదని చెప్పారు. గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా సోలార్‌ జల వికాసం ఉపయోగపడుతుందన్నారు. పట్టాలు పొందిన గిరిజనుల భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్‌ సర్వే, తదుపరి బోర్లు వేయడం, సోలార్‌ పంపు సెట్లు బిగించడం అన్ని పనులు ఒకే ఏజెన్సీకి కేటాయించాలని తద్వారా జాప్యం జరగకుండా, గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా పథకం అమలు సులభతరం అవుతుందన్నారు. ఈ పథకం అమల్లో ఉద్యానవన శాఖ పాత్ర కీలకమైందని తెలిపారు. అవకాడో, వెదురు వంటి పంటలు గిరిజనులు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పంటల సాగు జరుగుతున్న తీరుపై గిరిజన రైతులకు అవగాహన కల్పించేందుకు స్టడీ టూర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పామాయిల్‌, వెదురు వంటి పంటలు చేతికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ఈలోపు గిరిజనులకు ఆదాయం సమకూరేందుకు అవసరమైన అంతర పంటల సాగును గుర్తించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మొదట ఈ పథకాన్ని ఆదిలాబాద్‌, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఆయా జిల్లా అధికారులతో సంప్రదింపులు జరపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మే రెండో వారంలోగా పథకం అమలుకు అవసరమైన అన్ని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, గిరిజన శాఖ కమిషనర్‌ శరత్‌, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూకి, ఉద్యాన శాఖ కమిషనర్‌ యాస్మిన్‌ భాష పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights