
ఇంట్లో కొన్ని వస్తువులను సరిగ్గా ఉంచకపోతే.. అవి ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను తెరిచి ఉంచడం వల్ల దుఃఖం, పేదరికం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి విషయాల గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం అనేది మన ఇంట్లో శుభాన్ని తీసుకువచ్చే శాస్త్రం. ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తే శుభ ఫలితాలు వస్తాయి. కొన్ని విషయాలను విస్మరిస్తే దాని ప్రభావం ప్రతికూలంగా ఉండొచ్చు. కొన్ని వస్తువులను అనవసరంగా తెరిచి ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్మకం ఉంది. కాబట్టి ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.
పుస్తకాలను చదివిన తర్వాత తెరిచి ఉంచడం తప్పుగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం పుస్తకాలు బుధ గ్రహాన్ని సూచిస్తాయి. ఇవి తెలివితేటలు, వాక్చాతుర్యానికి సంబంధించినవి. ఇంట్లో పుస్తకాలను తెరిచి ఉంచితే బుధ గ్రహం బలహీనపడే అవకాశాలు ఉంటాయి. ఇది విద్యకు, తెలివితేటలకు దుష్ప్రభావం కలిగించవచ్చు.
ఉప్పును ఉపయోగించిన తర్వాత మూసివేయకపోతే.. అది కూడా చెడు ప్రభావాన్ని కలిగించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చంద్రుడికి సంబంధించినది. దీన్ని తెరిచి ఉంచితే చంద్రుడు బలహీనపడతాడు. చంద్రుడు బలహీనంగా మారితే మనస్తాపం, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. సోమవారం రోజు ఉప్పును దానం చేస్తే మంచిదని చెబుతారు.
ఇంట్లో అల్మారాను తెరిచి ఉంచితే లక్ష్మీదేవి అసంతృప్తిగా ఉంటుందని చెబుతారు. ఇది పేదరికాన్ని పెంచే అవకాశాలు కల్పిస్తుంది. సంపద నిల్వగా ఉండాలంటే అల్మారాను కచ్చితంగా మూసివేయాలి.
వంటగదిలో ఆహార పదార్థాలను తెరిచి ఉంచడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. తెరిచి ఉంచిన ఆహారం చెడిపోవడమే కాకుండా.. ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే తినే పదార్థాల్లో కీటకాలు పడితే ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.
ఇంట్లో పాలపై కూడా మూత పెట్టకపోతే అది శుక్ర గ్రహంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. శుక్రుడు బలహీనపడితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కాబట్టి పాలపై ఎప్పుడూ మూతపెట్టాలి.