దుబాయ్ నుండి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు అలియాస్ హర్హ్‌సవర్దిని రన్యా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో ఒక కీలక సమాచారం బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ కేసులో సహ నిందితుడైన తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అలియాస్ విరాట్ కొండూరుకు చెందిన అమెరికా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దుబాయ్ తనిఖీల ద్వారా బంగారాన్ని బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. గత వారం రన్యా రావు బెయిల్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టులో సమర్పించిన పత్రాలలో నటిని అరెస్టు చేసిన ఏజెన్సీ – డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) గతంలో యూఏఈని సందర్శించినప్పుడు దుబాయ్‌లో రన్యా వచ్చిన కస్టమ్స్ డిక్లరేషన్లలో.. బంగారాన్ని జెనీవాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
ఈ డిక్లరేషన్ పత్రాలు ఆమె అరెస్ట్ తర్వాత నటి నివాసంలో చేసిన సోదాల్లో లభించాయి. కస్టమ్స్ సుంకం ఎగవేతల ద్వారా ఇండియాకు పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం వెనుక దుబాయ్‌లలో వ్యవస్థీకృత సిండికేట్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 12.56 కోట్ల రూపాయల విలువైన 14.2 కిలోల బంగారాన్ని బెంగళూరులోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా రన్యా రావు రూ.4.83 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నటి అరెస్టు తర్వాత ఆమె ఇంటి నుండి రూ.2.67 కోట్ల నగదు, రూ.2.07 కోట్ల ఆభరణాలను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. మార్చి 3 నుంచి 9 మధ్య జరిపిన దర్యాప్తులో దుబాయ్‌లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడంలో కొండూరుకు చెందిన యూఎస్ పాస్‌పోర్ట్‌ను కీలక సాధనంగా ఉపయోగించారని తేలింది.
దుబాయ్ విమానాశ్రయం వెలుపల ఒక అపరిచితుడి నుండి 14.2 కిలోల బంగారాన్ని అందుకున్నట్లు నటి రన్యా రావు DRIకి ఇచ్చిన వాంగ్మూలాలలో పేర్కొన్నప్పటికీ, ఆమె స్మగ్లింగ్ ఆపరేషన్‌లో చురుకైన పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్‌లోని ఒక డీలర్ నుంచి బంగారం కొనుగోలు చేసి, కొనుగోలు పత్రాల ద్వారా దుబాయ్‌లోని తన సహచరుడు కొండూరు పేరుతో డిక్లరేషన్ చేయించుకున్నట్లు తేలింది. కొండూరు పేరుతో ఉన్న బంగారాన్ని జెనీవాకు తీసుకెళ్తున్నట్లు దుబాయ్ కస్టమ్స్‌కు చూపించి, ఇండియాకు తీసుకొచ్చింది. విక్రమ్ కొండురుకు యూఎస్ పాస్‌పోర్ట్ ఉండటం, బంగారాన్ని జెనీవా, స్విట్జర్లాండ్‌ను తీసుకెళ్తున్నట్లు డిక్లరేషన్‌లో పేర్కొనడంతో యూఎస్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రత్యేక వీసా అవసరం లేదు కాబట్టి, యూఎస్ పాస్‌పోర్ట్ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో 90 రోజుల పర్యాటక వీసాగా పనిచేస్తుంది కాబట్టి, కొండూరు పేరుతో దుబాయ్ కస్టమ్స్ వద్ద బంగారానికి లైన్ క్లియర్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దుబాయ్‌లో చెకింగ్ అయిపోయిన తర్వాత టాయిలెట్‌లో బ్యాండేజ్‌లతో బంగారు ఆభరణాలను తన శరీరంపై అంటించుకున్నట్లు రన్యా రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గత కొన్ని నెలల్లో రన్యా రావు, విక్రమ్ దాదాపు 25 సార్లు దుబాయ్‌కు ప్రయాణించారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 3న రన్యా రావు బెంగళూరు నుండి దుబాయ్‌కు ఉదయం 4 గంటలకు విమానంలో బయలుదేరి వెళ్లింది. తిరిగి అదే రోజు బంగారంతో వచ్చి దొరికిపోయింది. ఈ ప్రయాణ టిక్కెట్లను తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డుతో బుక్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.