ఇటీవల కాలంలో జరుగుతున్న దారుణ హత్యలు బయట వారి కంటే.. కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతడి మూడో భార్య.. కొడుకే దారుణంగా చంపేయటం సంచలనంగా మారింది. వివాహేతర సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమన్న అనుమానం వ్యక్తమవుతోంది.
బంజారాహిల్స్ కు చెందిన 57 ఏళ్ల మసీయుద్దీన్ కొన్నేళ్ల క్రితం షబానాను పెళ్లి చేసుకున్నారు. ఆమె అతడికి మూడో భార్య. అప్పటికే ఆమెకు సమీర్ అనే కొడుకు ఉన్నాడు. వారు బండ్లగూడ క్రిస్టల్ టౌన్ షిప్ లోని ఒక అపార్టుమెంట్ లో అద్దెకు ఉంటున్నారు. ఆమె వద్దకు మసీయుద్దీన్ రోజు వచ్చి వెళుతుంటాడు.

ఇదిలా ఉండగా.. ఇటీవల వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. షబానాకు వివాహేతర సంబంధమే దీనికి కారణంగా భావిస్తున్నారు. సోమవారం కూడా దీనికి సంబంధించిన అంశం మీదనే పెద్ద గొడవే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం మసీయుద్దీన్ ఆమె ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంట్లో షబానా.. ఆమె కొడుకు సమీర్ తో పాటు అతడి స్నేహితుడు ఫరీద్ ఉన్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మసీయుద్దీన్ ఇంట్లోకి వచ్చినంతనే చున్నీతో అతడి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు.
ఆ పై నోట్లో క్లాత్ ను కుక్కేశారు. కొడుకు స్నేహితుడు ఫరీద్ తో కలిసి కత్తితో గొంతు కోసి చంపేశారు. మంగళవారం రాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో నిందితులు వెళ్లి లొంగిపోయారు. తామే చంపేసినట్లుగా ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.