ఓ మహిళ ఆసుపత్రి సిబ్బందిని బురిడీ కొట్టించింది. ఏకంగా నర్సునని చెప్పి మగ బిడ్డని ఎత్తుకెళ్లింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఐదు రోజుల మగ బిడ్డ కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. బిడ్డను తీసుకెళుతున్న క్రమంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా నిందితురాలను గుర్తించారు. నిందితురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వినిని ఆర్టీసీ బస్సులో ఐదు రోజుల మగ బిడ్డను తీసుకెళ్లడం గుర్తించి, సినిమా తరహాలో చింతూరు సమీపంలో నిందితురాలని పట్టుకున్నారు. బిడ్డను పోలీసు బందోబస్తులో ప్రత్యేక అంబులెన్స్‌లో చింతూరు నుంచి రంపచోడవరం తీసుకొచ్చి ఆస్పత్రిలోనే తల్లిదండ్రులకు చెంతకు చేర్చారు.
అందరినీ పూల్స్ చేసి..
ఆసుపత్రిలో సిబ్బంది ఉండగానే తాను ఒక స్టాఫ్ నర్స్ నంటూ బిడ్డకు కామెర్లు ఉన్నాయి ప్రత్యేక వార్డు షిఫ్ట్ చేయాలని తల్లి, తండ్రిని నమ్మించి బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది అశ్విని. ఆసుపత్రిలో సెక్యూరిటీ లేకపోవడం వల్లే బిడ్డ కిడ్నాప్ గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బిడ్డను పట్టుకునే క్రమంలో టీవీ9లో వచ్చిన వార్త వల్ల తమ బిడ్డను కనిపెట్టడంలో సాయం అందింది అంటూ, తమ బిడ్డ దొరకడంలో టీవీ9 ప్రత్యేక పాత్ర ఉందని, అందుకోసం టీవీ9కు మేం రుణపడి ఉన్నామంటూ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నిందితులను పట్టుకునే క్రమంలో, మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా బిడ్డను రెండు గంటల వ్యవధిలో పట్టుకున్నామని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ప్రెస్ మీట్ లో తెలిపారు. అయితే నిందితురాలి వెనకాల ఇంకెవరైనా ఉన్నారని కోణంలో దర్యాప్తు చేస్తున్నామంటూ డీఎస్పీ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.