జగిత్యాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో విస్మరణకు గురైన పలు రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యమిస్తామన్న హామీ మేరకు వ్యవసాయం, పారిశ్రామికం, సేవా, విద్యా, వైద్యం రంగాలకు తగినన్ని నిధులు కేటాయిస్తారని విశ్వసిస్తున్నారు. ముత్యంపేట నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) పునరుద్ధరణ, కొండగట్టు దేవస్థాన పర్యాటక అభివృద్ధి, ధర్మపురి దేవస్థాన అభివృద్ధి, రోళ్లవాగు ప్రాజెక్టు, సూరారం ప్రాజెక్టుల అభివృద్ధి పనులు, కోరుట్ల పశువైద్య కళాశాలకు యూనివర్సీటీ హోదా తదితర అంశాలకు బడ్జెట్‌లో మోక్షం బడ్జెట్‌లో లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలపై ప్రత్యేక కథనం…
ఫపునరుద్ధరణకు నోచుకోని ఎన్‌డీఎస్‌ఎల్
ముత్యంపేట ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారం లే ఆఫ్‌తో మూతపడి ఏడేళ్లుగా తెరుచుకోవడం లేదు. లేఆఫ్ విధించాక యంత్రాల నిర్వహణ ఉండడం లేదు. రూ.మూడొందల కోట్ల విలువ చేసే పలు యంత్రాలు ఆయిలింగ్ లేక తుప్పు పడుతున్నాయి. ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర కర్మాగారం పరిధిలో సుమారు 500 మంది పర్మినెంట్, సీజనల్, కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేసేవారు. 150 లారీల్లో చెరుకును కర్మాగారానికి చేర్చేవారు. ప్రస్తుతం వీరంతా వీధిన పడి ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటున్నారు. జిల్లాలో చెరుకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. చెరుకు సాగుకు, ఫ్యాక్టరీకి పూర్వవైభవం రావాలన్న ఆకాంక్షతో సంబంధిత వర్గాలున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత కర్మాగార పునరుద్ధరణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కర్మాగార అప్పులను చెల్లించింది. ప్రస్తుతం పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరగాలని రైతులు, వర్కర్లు ఆశిస్తున్నారు.
ఫనత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు
జిల్లాలో ప్రధానంగా ఎస్సారెస్పీ కింద 1,87,890 ఎకరాలు సాగువుతోంది. సారంగాపూర్, ధర్మపురి తదితర ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి రూ.187 కోట్లతో నిర్మిస్తున్న రోళ్లవాగు ప్రాజెక్టు, బొళ్లి చెరువు పనులు ఇంకా పూర్తి కాలేదు. కథలాపూర్ మండలంలో రూ.204 కోట్లతో నిర్మించాలనుకున్న సూరమ్మ రిజర్వాయర్ కేవలం ప్రతిపాదనలకే పరిమితమమైంది. సూరమ్మకు కుడి, ఎడమ కాలువలను స్టేజ్2, ఫేజ్1లో భాగంగా తవ్వి మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలల్లోని సుమారు 43 వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. జగిత్యాల-నిర్మల్ జిల్లాల మధ్య మూలరాంపూర్ వద్ద రూ.520 కోట్లలో నిర్మించతలపెట్టిన సదర్‌మాట్ బ్యారేజీ పనులు పూర్తి అయినప్పటికీ ప్రారంభం కాలేదు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులు చేయాల్సి ఉంది.
ఫకలగానే మిగిలిన మామిడి బోర్డు
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటైన మామిడి రైతులు పరేషాన్ అవుతున్నారు. ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నప్పటికీ మామిడి బోర్డు ఏర్పరచకపోవడం, మద్దతు ధర ప్రకటించకపోవడంతో పసుపు రైతులు వ్యాపారుల ఉచ్చుల నుంచి బయటకు రాలేకపోతున్నారు. రాష్ట్రంలోనే మామిడి పంటకు గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లాలో సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరగాల్సి ఉంది. మామిడి బోర్డుల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కలగానే మిగిలి పోయింది. పసుపు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఫఅభివృద్ధికి నోచుకోని కొండగట్టు
కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇక్కడకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుండగా, వారికి కనీస అవసరాలు తీర్చడానికి సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉంది. గతంలో కొండగట్టు ఘాట్‌రోడ్డుపై వస్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్రమాదంలో 67 మంది మృతి చెందగా అనేక మంది మంచాలకే పరిమితమయ్యారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రత్యేక ప్రణాళికతో ఆదుకోవాలన్న డిమాండ్ ఉంది. కొండగట్టులో రోప్‌వే ఏర్పాటు జాడ కనిపించడంలేదు.
ఫమున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులపై ఆశలు
ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయం, మల్లాపూర్ కనకసోమేశ్వరస్వామి గుట్ట, పైడిమడుగు, భూషణ్‌రావుపేట మర్రవ్వ ఆలయాలు, నాగులపేట సైఫన్ తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న పాలకుల హామీ నెరవేరడం లేదు. జిల్లాలో సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అతీగతీ లేకుండా పోయింది. స్థానికంగా ఉపాధి లేకపోవడం వల్ల ముంబై, దుబాయి వంటి ప్రాంతాలకు యువత వలసలు ఆగడం లేదు. జిల్లాలో పర్యాటకానికి, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు స్థల సేకరణకే పరిమితమమైంది. కోరుట్ల పశువైద్య కళాశాల అప్‌గ్రేడ్ చేసి విశ్వవిద్యాలయ హోదా కల్పించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ అమలు, ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని జిల్లా ప్రజలు ఆశ పడుతున్నారు. జగిత్యాలలో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో జిల్లా సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారని, వరాలు ప్రకటిస్తారన్న ఆశతో ప్రజలు ఉన్నారు.
Updated Date – Mar 19 , 2025 | 01:10 AM