
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి మండలంలోని బస్టాండ్ సెంటర్ లో కూడలి సీసీ రోడ్డు ఆక్రమణపై అధికారులు ప్రజా క్షేత్రంలో గ్రామ సభ ద్వారా నిర్ణయం తీసుకోవాలని సోషల్ వర్కర్, సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్, ఫిర్యాదు దారుడైన మొహమ్మద్ జలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలతో మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు 30 సంవత్సరాలుగా ఉన్న పీఆర్ సీసీ రోడ్డు ఇటీవల కాలంలో ఆక్రమణకు గురైనా ఆళ్ళపల్లిలో అధికారులు, నాయకులు, యువత ఎవరూ నోరు మెదపకపోవడంపై ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అధికారులు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల్లో విషయాన్ని చూసి, స్పందించి రావడం హర్షణీయమన్నారు. అధికారులు విచారణలో భాగంగా గ్రామసభ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఆళ్ళపల్లిలో సైతం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు రోడ్డు ఆక్రమణపై అందరూ స్పందించాలని పిలుపునిచ్చారు. కబ్జా పర్వం ఆళ్ళపల్లిలో కొనసాగితే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఆస్తులైన రోడ్లు ఎడారిలో ఒయాసిస్సులు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ఆక్రమణపై త్వరలో జిల్లా స్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు వ్యాఖ్యానించారు. పీఆర్ సీసీ రోడ్డు పగులగొట్టి పోసిన మట్టి సత్వరమే తొలగించి, ప్రజల రాకపోకలకు యథాతథంగా దారి ఇవ్వాలని, లేనిపక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తెలగాని శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ మొహమ్మద్ ఖయ్యుం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బుర్ర వెంకన్న, సయ్యద్ సత్తర్, తదితరులు పాల్గొన్నారు.