ఆర్‌.ఎల్‌.ఐ.సీతో పాటు బంకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు

Written by RAJU

Published on:

ఆర్‌.ఎల్‌.ఐ.సీతో పాటు బంకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కష్ణా, గోదావరి నదులపై ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పాటు బంకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. నిబంధనలకు భిన్నంగా ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మించ తలపెట్టిన ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడి తాగు నీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ఆయన నీటిపారుదల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా రాష్ట్ర ప్రభుత్వ సలహా దారుడు అదిత్యా దాస్‌ నాధ్‌, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ వినరు కష్ణారెడ్డి, ఈఎన్సీలు అనిల్‌ కుమార్‌, విజరు భాస్కర్‌ రెడ్డి, సి.ఇ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటిపారుదల స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులతో పాటు అడ్వకేట్‌ జనరల్‌తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి గోదావరి, కష్ణా నదుల్లో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను కాపాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్టు తెలిపారు. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి నది నీటితో నిర్మించ తలపెట్టిన బంకచర్ల ఎత్తిపోతల పథకం రూ.80,112 కోట్లు అనీ, ఈ ప్రాజెక్టు ద్వారా పోలవరం వద్ద 200 టీఎంసీల నీటిని బొల్లపల్లి రిజర్వాయర్‌, బంకచర్ల హెడ్‌ రెగ్యులేటట్‌ ద్వారా రాయలసీమకు మళ్లించనున్నారని ఆయన వెల్లడించారు. తద్వారా గోదావరి, కష్ణా నదులను అనుసంధానం చేసేందుకు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం రూట్‌ మ్యాప్‌ రూపొందించుకుందని ఆయన తెలిపారు.
1980లో జి.డబ్ల్యూ.డి.టి ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు, 2014 ఆంద్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థికరణ చట్టాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర జల వనరుల సంఘం, జీ.ఆర్‌.యం.బి., కే.ఆర్‌.యం.బి., ఏపేక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతులు పొందకుండానే వారు ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థికరణ చట్టంలోని 46(2),46(3) ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనీ, ఇది పూర్తిగా నిబంధనలకు భిన్నంగా ఉందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం కష్ణా నది జలాశయాలతో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణా ప్రభుత్వం ఆక్షేపించిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఇందుకు స్పందించిన కేంద్ర పర్యావరణ ,అటవీ,వాతావరణ శాఖలకు చెందిన నిపుణుల కమిటీ ఫిబ్రవరి నెలలో రాయలసీమ ప్రాజెక్టును ముందున్న స్థితికి తీసుకు రావాలని ఆదేశించారని ఆయన వివరించారు. పర్యావరణ నిబంధనలను ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని కమిటీ స్పష్టం చేసిందన్నారు. తెలంగాణా ప్రభుత్వంతో పాటు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ , సుప్రీంకోర్టు, సంబంధిత మంత్రిత్వ శాఖలు చేసిన విజ్ఞప్తుల ఫలితమే ఆ ప్రాజెక్టును పూర్వ స్థితిలో ఉంచాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇంత జరిగిన ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం పరోక్ష మార్గాల ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని కోనసాగిస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణా ప్రభుత్వం ఈ పరిణామాలను చూస్తూ ఉరుకోబోదనీ, తెలంగాణాకు జరుగుతున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు ముందుంచడంతో పాటు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనపై వాదనలు వినిపించి అక్రమ నీటి తరలింపును అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు గోదావరి వరద నీటిని మల్లింపు అంటూ జరిగితే భద్రాచలం వంటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ప్రమాదపుటంచున పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ళుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూపించిన ఉదాసీనత కారణంగానే ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేటశారు. అక్రమంగా నీటిని ఆంద్రప్రదేశ్‌ తరలించుకుంటు పోతుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చోద్యంలా చూసిందే తప్ప అడ్డుకోలేదని ఆయన విమర్శించారు.
పూడిక తీత పనులకు త్వరలోనే టెండర్లు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పూడికతీత పనులకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్టు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. చెరువుల్లో రిజర్వాయ ర్లలో నీటి సామర్ధ్యం పెంపొందించేందుకు పూడికతీత పనులు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.

Subscribe for notification
Verified by MonsterInsights