ఆయిల్‌పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి

Written by RAJU

Published on:

ఆయిల్‌పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి– ఈ పంటకు ఉజ్వల భవిష్యత్తు ఉంది
– మద్దతు ధరకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకుకావాలి
– జూన్‌ కల్లా గోదావరి జలాలతో సాగునీరు అందిస్తాం
– ఆగస్టు 15న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రాకపోకలు మొదలుపెడతాం : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీకి శంకుస్థాపన
నవతెలంగాణ-సత్తుపల్లి/వేంసూరు
ఆయిల్‌ఫాం పంటకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ నేపథ్యంలో పామాయిల్‌ తోటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినాన ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మంత్రి తుమ్మల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌ జంగా రాఘవరెడ్డితో కలిసి ఆయిల్‌ఫాం ప్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ.. పామాయిల్‌ పంటకు మద్దతు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌ రాఘవరెడ్డిని, ఎండీ యాస్మిన్‌బాషాను మంత్రి తుమ్మల కోరారు. వర్షాలతో సంబంధం లేకుండా వచ్చే జూన్‌ నాటికల్లా గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకించి చర్యలు తీసుకుంటామన్నారు. వేంసూరు మండల రైతులకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో గతంలో ఎన్టీఆర్‌ కాలువను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాజీవ్‌ లింకు కెనాల్‌ను పూర్తిచేసి ఇటీవల వైరా నియోజకవర్గానికి గోదావరి జలాలను పారించామన్నారు. నాగార్జున సాగర్‌ నిండక పోయినా జూన్‌కల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించేందుకు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఆగస్టు 15 నాటికల్లా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు పూర్తి చేసుకొని రాకపోకలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. దాంతో మవుతాయని, ఖమ్మం నుంచి సత్తుపల్లికి కేవలం 33 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టరు మట్టా రాగమయి దయానంద్‌ అన్నారు. కల్లూరుగూడెంలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ వచ్చే ఉగాది నాటికల్లా పూర్తవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతంలో 100నుంచి 200మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని, పరోక్షంగా వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఆయిల్‌ఫెడ్‌ ఎండీ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ.. ఉగాది పర్వదినాన ఈ ప్రాంతంలో నాలుగో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎల్‌.రాజేందర్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌, ఉద్యాన శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెలంగాణ, ఆంధ్రా ఆయిల్‌ఫాం అధ్యక్షులు పాల్గొన్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights