జగిత్యాల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇంటి స్థలం ఉన్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆరంభంలోనే జాప్యమవుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు అర్హులైన 1,409 మందికి ఇళ్లను మంజూరు చేశారు. జనవరి 26న అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించి వారికి మంజూరు పత్రాలు అందజేశారు. రెండు నెలలవుతున్నా ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ముగ్గు పోయడం (మార్కవుట్) షురూ చేయలేదు. కొన్నిచోట్ల ముగ్గు పోసినా పునాదులు తవ్వుకున్నారే తప్ప నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో ఇందిరమ్మ నిర్మాణాలు కేవలం మోడల్ ఇళ్లకే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన హౌసింగ్ శాఖకు అధికారులు లేకపోవడం గమనార్హం. పలు ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినా వారు వాటిని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఫకొరవడిన పర్యవేక్షణ
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పలు వార్డులు, మండలాల్లోని ఒక్కో గ్రామంలో అర్హులైన వారిని గుర్తించి ప్రొసీడింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా నిర్మాణాల్లో మాత్రం వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం 270 ఇళ్లకు మాత్రమే ముగ్గు పోశారు. ఇందులో కొన్ని చోట్ల పునాదులు తవ్వుకున్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి. ముగ్గు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు హౌసింగ్ శాఖలో లేరు. ఆ శాఖలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని మండలాల్లోని ఇళ్లను పర్యవేక్షించడం వీరికి కత్తి మీద సాములా మారింది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగాలనే ఉద్దేశ్యంతో ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్‌పీవోలు, డీపీవోలు, గ్రామ కార్యదర్శులు, పలు ప్రభుత్వ శాఖలు పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లే అవకాశం లేకపోవడం, అధికారులు ఇందిరమ్మ ఇళ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే నిర్మాణాలు ఊపందుకుంటే పరిస్థితి ఏంటనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఫస్థలం నిబంధనల సడలింపు..?
గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక స్థలంలో చూపించి మరో స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం, పాత ఇళ్లకే రంగులు వేసి కొత్త వాటిగా చూపి బిల్లులు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. సర్వే సమయంలో చూపిన స్థలంలోనే ఇళ్లను నిర్మించుకునేలా దానికి జియో పెన్సింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ విధానంలో యాప్‌లో లబ్ధిదారుల వివరాలు, ఇంటి స్థలం వంటి సమాచారం నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో పలుచోట్ల నెట్‌వర్క్ లేకపోవడం, సర్వర్ సమస్య తలెత్తడం వంటి కారణాలతో ఆ వివరాలు నమోదు చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో నిర్మాణ స్థలంలో వర్కవుట్ ఇచ్చేందుకు సమస్య తలెత్తింది. దీన్ని గమనించిన అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్థలం క్యాప్చర్ నిబంధనలో సడలింపును ఇచ్చిందంటున్నారు. సర్వే సమయంలో చూపిన స్థలమే కాకుండా లబ్ధిదారు తమకు నచ్చిన చోట ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించిందని తెలుస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో మార్కవుట్‌ను గ్రౌండింగ్ చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.
వేగవంతమయ్యేలా చర్యలు
-వాసం ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కవుట్‌ను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేసి పనులు వేగంగా సాగేలా దృష్టి సారిస్తాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ జిల్లా అధికారులు, ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. లబ్ధిదారులను ప్రోత్సహించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
………………………………………………………………………………………………………………..
మండలం మంజూరైన ఇళ్లు మార్కవుట్ ఇచ్చినవి….
………………………………………………………………………………………………………………..
కొడిమ్యాల………………..38…………………………..16
మల్యాల…………………..106………………………….35
బుగ్గారం…………………..80…………………………….5
ధర్మపురి…………………..123……………………………13
ఎండపల్లి…………………127…………………………….17
గొల్లపల్లి……………………81……………………………….6
పెగడపల్లి………………..78……………………………….18
వెల్గటూరు………………..51………………………………12
బీర్‌పూర్……………………74………………………………18
జగిత్యాల అర్బన్………43……………………………..19
జగిత్యాల రూరల్…….43……………………………..10
రాయికల్ …………………133…………………………..16
సారంగపూర్…………….24……………………………..9
ఇబ్రహీంపట్నం…………47…………………………….9
కోరుట్ల…………………………57……………………………..8
మల్లాపూర్………………….31………………………………14
మెట్‌పల్లి………………………59……………………………..8
బీమారం………………………74……………………………..18
కథలాపూర్………………….119…………………………….14
మేడిపల్లి……………………….38………………………………15
………………………………………………………………………………………………………………..
మొత్తం…………………………1,409………………………..270
………………………………………………………………………………………………………………..