నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని 4కెలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. ప్రసాద్స్ డిజిటల్ టీమ్ ఆరు నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారు. 34 ఏళ్ళ క్రితం జూలై 18, 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్డ్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఈ చిత్రాన్ని నేను నిర్మించడానికి నాకెంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంత గొప్ప ప్రాజెక్టు నాకు ఇచ్చి నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లు ఎక్కించిన బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుకి ఇలా రీ- రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఎగ్జైట్ అయ్యారు. అప్పట్లో నేను కొత్త నిర్మాత అయినా సరే, నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బాలయ్యకి సదా కృతజ్ఞుడిని. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా… రెండు పాత్రల్లోనూ ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. కథకుడిగా, దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిత్రమిది. ఇళయరాజా సంగీతం, జంధ్యాల మాటలు, పీసీ శ్రీరామ్ – వీఎస్‌ఆర్ స్వామి – కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి’ అని తెలిపారు.

‘ఆదిత్య 369’ రీ-రిలీజ్‌కి రంగం సిద్ధం
Written by RAJU
Published on: