ABN
, Publish Date – Mar 27 , 2025 | 11:58 PM
గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌కు తాళం వేయడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఆక్సిజన్ దొరకక ప్రాణాలను కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పింది.

కళ్యాణ్‌నగర్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌కు తాళం వేయడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఆక్సిజన్ దొరకక ప్రాణాలను కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పింది. 2021లో ఆక్సిజన్ కొరత తీర్చడానికి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. మూడు సంవత్సరాల వరకు బాగానే పని చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను మెయింటెనెన్స్ చేయకపోవడంతో దానికి ఇప్పుడు తాళాలు వేశారు. నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ ఒకేసారి 250మందికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. 2021లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ రవీందర్‌రావు ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకుని రెండో విడుత కరోనా బారిన పడిన వారికి ఊపిరిని అందించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు నడిచిన ఈ ప్లాంట్ రామగుండం మెడికల్ కళాశాలకు అనుబంధంగా మారింది. అప్పటి నుంచి ఈ ప్లాంట్‌ను పట్టించుకోవడం లేదు. మూడు షిప్టుల్లో ముగ్గురు ప్లాంట్ నిర్వహణ చూసేవారు. చిన్న చిన్న లోపాలను సవరించకుండా ప్లాంట్‌కు తాళం వేయడంతో ఆక్సిజన్ లభించక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇన్‌స్టాల్ చేయని లిక్విడ్ ఆక్సిజన్
నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి ఆవరణలో నెల రోజుల క్రితం 10కేఎల్ గల లిక్విడ్ ఆక్సిజన్ పనులు పూర్తయినప్పటికీ దానిని ఇన్‌స్టాల్ చేయడం లేదు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న 80పడకల ఆసుపత్రిలో గ్యాస్ పైప్‌లైన్ పూర్తి చేసినప్పటికీ దానికి అనుసంధానం చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా బీ టైపు సిలిండర్లను వినియోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రోగులకు ఆక్సిజన్ లేక పరేషాన్ అవుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులకు సిలిండర్ రవాణా అప్పగింత
ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నప్పటికీ దానిని నిర్వహణ చేయకుండా చెడిపోయిందంటూ మంచిర్యాల, జనగామకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లకు బి టైపు సిలిండర్లను సరఫరా చేయడానికి నెల రోజుల క్రితం టెండర్లు పిలిచింది. ఈ సిలిండర్లను రూ.700 నుంచి రూ.800లకు కొనుగోలు చేస్తున్నారు. జనగామకు చెందిన ఒక కాంట్రాక్టర్ రూ.400లకు క్రోడీకరణ చేసినప్పటికీ అతనికి టెండర్ ఇవ్వకుండా ఎక్కువ ధరకు మంచిర్యాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఉన్న ప్లాంట్‌ను మూలనపడేసి మరమ్మతు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులచే సిలిండర్లను సరఫరా చేయించడంపై గందరగోళం నెలకొన్నది. కొందరు కమీషన్ల కోసమే ఆక్సిజన్ ప్లాంట్‌ను మరమ్మతు చేయకుండా, కొత్తగా వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా అత్యవసర సమయంలో ఆక్సిజన్ లేక రోగులు తల్లడిల్లిపోతున్నారు.
Updated Date – Mar 27 , 2025 | 11:58 PM