ఓ సాధారణ కార్యకర్తగా ప్రారంభమై కమ్యూనిస్టు నేతలుగా శిఖరాగ్రానికి చేరిన మహానీయులు వారు. ఎన్ని విద్రోహాలు..! ఎన్నెన్ని విచ్ఛిన్నాలు..! ఈ సంక్షోభాలన్నిటా పార్టీని, వామపక్ష ప్రభుత్వాలను కాపాడుకోవడానికి మొక్కవోని ధైర్యం, ఉక్కు సంకల్పంతో వారు చూపిన నిర్మాణదక్షత అద్భుతం. పార్లమెంటరీ విలువలను కాపాడుకుంటూ, తమ ప్రభుత్వాలను ప్రజారంజకంగా నడిపించిన వారి సారధ్యం అమోఘం. నిర్బంధాలూ, కుట్రలు ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తున్నప్పుడు.. అంతులేని సంఘర్షణకు గురవుతూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా గుండెనిబ్బరంతో ప్రభుత్వాన్ని నిలబెట్టడం వారికే చెల్లింది. మిన్ను విరిగి మీద పడ్డా చలించక.. ప్రజ సంక్షేమమే పరమావధిగా పాలన అందించిన ముఖ్యమంత్రులు వారంతా. ఎక్కడా ఇసుమంతైనా అవినీతి పంకిలం అంటని నిష్కళంక నేతలు. వారి సైద్ధాంతిక నిబద్ధత ముందు, కర్తవ్యదీక్ష ముందు వ్యక్తిగత విషయాలు ఏవైనా చాలా స్వల్పమైనవని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. ముఖ్యమంత్రులుగా వారు తీసుకున్న వేతనాన్ని పార్టీకి ఇచ్చి… పార్టీ ఇచ్చే అలవెన్స్‌తో సాధారణ జీవితాలు గడిపిన సామాన్యుల ముఖ్యమంత్రులు వాళ్లు. సీఎంలకు ఉండే భారీ కాన్వారులను, విలాసవంతమైన సౌకర్యాలను వారు త్యజించారు. నిరాడంబర పాలన సాగించిన ఆదర్శనేతలు. సీపీఐ(ఎం) ముఖ్యముంత్రుల సంక్షిప్త పరిచయం..
తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి
1957 ఎన్నికలలో కేరళలో కాంగ్రెస్‌ను ఓడించి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాగానే భూసంస్కరణలు అమలు చేశారు. భూస్వామ్య వ్యవస్థ నడ్డివిరిచే చర్యలు చేపట్టారు. కార్మికోద్యమాలు, ప్రజాందోళనల పట్ల పోలీసులు అణచివేత విధానాలు అనుసరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ప్రజాస్వామిక సంస్కృతి తీసుకొచ్చారు. భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు రెచ్చగొట్టిన కాంగెస్ర్ 356 అధికరణ కింద ఇఎంఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 1967లో మళ్లీ వామపక్ష ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇంచుమించు మూడేండ్లు వున్న ఆ ప్రభుత్వం అంతకు ముందు అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రజానుకూల కర్తవ్యాలు, విధానాలు పూర్తిచేసింది. 1969లో ఆ ప్రభుత్వం కాంగెస్ర్ కుటల్రతోనే మరోసారి కూల్చబడింది. ఉద్యమ నిర్మాణం, సైద్ధాంతిక నిర్దేశంతో పాటు సామాజిక సంస్కరణలు, స్థానిక సంస్థల పటిష్టత, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి వుండాలని నిరంతరం తపించడమే గాక అందుకు తగు పద్ధతులను కూడా ఆయన తీసుకొచ్చారు. కేరళ మానవాభివృద్ధి సూచికల్లో ముందు నిలవడానికి ఇదో ప్రధాన కారణం.
జనరంజక పాలకుడు
దేశ రాజకీయాల్లోనే విశిష్ట నేతగా గుర్తింపు పొందిన, ప్రజా సంక్షేమానికి అలు పెరగని పోరాటం చేసిన నాయకుడు కామ్రేడ్ జ్యోతిబసు. 23ఏండ్లు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మార్క్సిస్టు దిగ్గజం. ముఖ్యమంత్రిగా జ్యోతిబసు ఆధ్వర్యంలో సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ పాలన బెంగాల్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చింది. కరువు రాష్ట్రంగా కునారిల్లిన పశ్చిమ బెంగాల్‌ను అన్నపూర్ణగా చేసింది. ఇది ఆయన నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆచరించిన ప్రజాసంక్షేమ పాలన ఫలితమే. బిసి రారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1967లో అజరు ముఖోపాధ్యాయ ప్రభుత్వంలో 1967 నుంచి 1969 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రెండేండ్లు కౌలుదార్లు వారి భూమిని వారనుభవించారు. కార్మిక పోరాటాల్లో పోలీసుల జోక్యం లేదు.
1977 ఎన్నికల్లో జ్యోతిబసు ఆధ్వర్యంలో లెఫ్ట్‌ఫ్రంట్ విజయ దుందుభి మోగించింది. అక్కడి నుంచి 2011 వరకు అంటే 34ఏండ్ల పాటు వామపక్ష కూటమి అధికారంలో కొనసాగింది. జ్యోతిబసు నేతృత్వంలో ప్రభుత్వం ఆపరేషన్ బర్గా కింద 14లక్షల మంది బర్గాదార్ల (కౌలుదార్ల)ను నమోదు చేయించారు. 11లక్షల ఎకరాల భూమిని శాశ్వతంగా వారి అధీనంలోకి తెచ్చి, సాగుచేసేవారి హక్కుకు రక్షణ కల్పించారు. భూ సంస్కరణల చట్టం కింద దాదాపు 13.7లక్షల ఎకరాల భూమిని సేకరించి, 10.4లక్షల ఎకరాలను 25లక్షల భూ వసతిలేని సాగుదారు కుటుంబాలకు పునఃపంపిణీ చేశారు. దాదాపు ఐదు లక్షల పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా భూ సంస్కరణల కింద పునఃపంపిణీ చేసిన భూమిలో 20శాతం బసు నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంలోనే పంపిణీ అయింది. భూ సంస్కరణల వల్ల దళితులు, ఆదివాసులు ప్రధానంగా ప్రయోజనం పొందారు. నివాస ప్రాంతాలకూ, పాఠశాలలకూ మధ్య సగటు దూరం తగ్గింది. సామాజిక సూచీలు కూడా ఎంతో మెరుగుపడ్డాయి. కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగాయి. మైనారిటీలకు సామాజిక భద్రత కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం ముఖ్య కర్తవ్యంగా పెట్టుకొని ఆ ప్రభుత్వం కృషి చేసింది.
కొత్త శకానికి నాంది
కూతుపరంబ శాసనసభ నియోజకవర్గం నుంచి 1970, 1977, 1991 మూడు సార్లు పినరయి విజయన్ విజయదుంధుబి మోగించారు. 1996లో పయ్యన్నూర్ శాసనసభ్యుడిగా గెలిచి ఇ.కె. నాయనార్ మంత్రివర్గంలో ఆయన విద్యుత్, సహకార మంత్రిగా పనిచేశారు. 2016 శాసనసభ ఎన్నికలలో గెలిచి కేరళ 12వ ముఖ్యమంత్రి అయ్యారు. 2021లో రెండో సారి ధర్మదోం నుంచి ఎన్నికై రెండోసారి ముఖ్యమంత్రిగా కేరళ సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 1996 నుంచి ఎల్డిఎఫ్ ప్రభుత్వంలో విద్యుత్, సహకార మంత్రిగా పినరయి విజయన్ పదవీకాలంలో రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో అసాధారణ పెరుగుదలను చూసింది. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ప్రాజెక్టుల పంపిణీ సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల సాధించింది. విద్యుత్ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. ప్రజల అవసరాలను అర్థం చేసుకున్న మంచి రాజకీయ నాయకుడిగా పరిపాలనా చతురత, అనుభవం, రాష్ట్ర సహకార రంగంలో వివిధ విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆయనకు సహాయపడింది. ఆయన 1983 నుంచి 1992 వరకు కన్నూర్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పని చేశారు. =ఖదీజఉ ఏర్పాటు వెనుక కూడా పినరయి విజయన్‌ది మార్గదర్శక స్ఫూర్తి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ పనితీరు అద్భుతమైన విజయం సాధించింది. అచంచలమైన స్ఫూర్తితో తనను తాను స్థిరపరచుకున్నారు. వరదలు, నిఫా వ్యాప్తి, కరోనా వంటి విపత్తులు ఎదురైన అన్ని సందర్భాల్లో కీలక పరిస్థితుల్లో ఆయన అసాధారణ ధైర్యంతో ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. దానికి తోడు, కేరళ అభివృద్ధి, సామాజిక సంక్షేమంలో గణనీయమైన వృద్ధిని సాధించారు. 2021 శాసనసభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ విజయానికి ఆయన ప్రభుత్వ దృఢమైన, ప్రభావవంతమైన పనితీరు ప్రధాన కారణం.
ఎల్లలు లేని ప్రజాభిమానం
2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టిన బుద్ధదేవ్.. ఏకంగా 11ఏండ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన సారధ్యంలో రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ సాంతం కమ్యూనిస్టు యోధుడిగా పేరు తెచ్చుకున్న బుద్ధదేవ్.. మితభాషి. కానీ, చేతల్లో మాత్రం ఆయన దూకుడుగా ఉందేవారు. 1977లో తొలిసారిగా కోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంస్కతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో జాదవ్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీని తర్వాత జాదవ్‌పూర్ నుండి ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు. జ్యోతిబసు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, హౌంశాఖ బాధ్యతలు సైతం నిర్వహించారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి 18 ఏండ్లు మంత్రిగా, 11 ఏండ్లు సీఎంగా ఉన్నా ఆయనకు సొంత బంగ్లా, కారు లేదు. జ్యోతి బసు తర్వాత పశ్చిమ బెంగాల్ పాలనను అందిపుచ్చుకున్న ఆయన.. ఎంత తగ్గి జీవించాలో.. ఈ ప్రపంచానికి నేర్పించారు. సాగులో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. గూర్ఖాలాండ్ తిరుగుబాటును ఎదుర్కోవడం, దానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడం ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. సాంస్కతిక రంగం, పోలీసు శాఖలలో ఆయన కషి ప్రశంసనీయం. ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ తీసుకున్న వేతనాన్ని పార్టీకి ఇచ్చేవారు. ఆయనకు పార్టీ నుంచి అప్పట్లో 3200 రూపాయలు వేతనంగా అందుకునే వారు. ముఖ్యమంత్రిగా భారీ కాన్వారులు ఆయన పెట్టుకునేవారు కాదు. కేవలం రెండు కార్లు, నలుగురు సిబ్బందితో ఆయన పాలనను సాగించారు. ఆయనకు రెండుగదుల ఒకే ఒక్క ఇల్లు తప్ప మరెక్కడా స్థిరచరాస్తులు లేవు. ఎల్లలు లేని ప్రజాభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆయన తిరస్కరించారు.
మాస్ లీడర్
బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి… దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ… పొట్టగడుపుకున్న అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెన్‌కోర్ రాష్ట్రంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకెళ్లటంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిస్థాయికి చేరింది. 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి…సీపీఐ(ఎం) ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఒకసారి (2006-2011) ముఖ్యమంత్రిగా, మూడుసార్లు విపక్షనేతగా వ్యవహరించారు. రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపారు. సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని ఆయన… అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కోసం ఉద్యమించారు. సినిమాల పైరసీ, లాటరీ మాఫియా, అవినీతికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు.
నిరాడంబర నాయకుడు
1957లో త్రిపుర టెరిటోరియల్ కౌన్సిల్‌కు నృపేన్ చక్రవర్తి ఎన్నికయ్యారు 1962లో ప్రతిపక్ష నాయకుడ య్యారు. త్రిపుర పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత, ఆయన 1972లో రాష్ట్ర విధానసభ సభ్యుడయ్యారు. 1977లో ఆయన వరుసగా రెండు స్వల్పకాలిక సంకీర్ణ ప్రభు త్వాల్లో మంత్రిగా సేవలందించారు. 1977లో త్రిపుర ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ గెలిచినప్పుడు నృపేన్ చక్రవర్తి ముఖ్యమంత్రి అయ్యారు. 1988 వరకు పదవిలో కొనసాగారు. 1988 ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఓటమి తర్వాత, ఆయన 1988 నుంచి 1993 వరకు త్రిపుర విధానసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. 1993 ఎన్నికల్లో, లెఫ్ట్ ఫ్రంట్ మళ్ళీ త్రిపురలో అధికారంలోకి వచ్చింది. ఆయన రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మెన్‌గా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏ బట్టల సూట్‌కేస్‌తో వచ్చారో, ఆధికారిక నివాసం నుంచి వెళ్లిపోయేటప్పుడు ఆదే బట్టల సూట్‌కేసుతో వెళ్లిన నిరాడంబరుడు.
అ’సాధారణ’ ముఖ్యమంత్రి
1972లో 23 ఏండ్ల వయసులో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీలో చేరిన నేత మాణిక్ సర్కార్. ఆరేండ్ల తర్వాత, 1978లో, కమ్యూనిస్ట్ పార్టీకి త్రిపురలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. 1980లో సర్కార్ అగర్తల నియోజకవర్గం నుంచి త్రిపుర శాసనసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన సీపీఐ(ఎం) చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. 1983లో కిషన్‌నగర్ నుంచి మరోసారి విజయం సాధించారు. ఆయన అత్యుత్తమ పనితీరు, నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 1993లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ సర్కార్‌ను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 1998లో సర్కార్ సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. అదే ఏడాది తొలిసారి త్రిపుర ముఖ్యమంత్రిగా నియమి తులయ్యారు. అప్పటి నుంచి సర్కార్ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు.
దీనితో భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల సమూహంలో సర్కార్‌కు స్థానం లభించింది. సీఎంగా ఆయన తనదైన ముద్ర వేశారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత సాధారణ సీఎం మాణిక్ సర్కార్. ఏమాత్రం ఆడంబరాలు ఇష్టపడని సాధారణ ముఖ్యమంత్రి. తన పేరు మీద ఇల్లు లేదు, కారు లేదు. రిక్షాలోనే సెక్రటేరియట్‌కు వచ్చేవారు. అనవసర ఖర్చులకు అసలు ఇష్టపడని వ్యక్తి ఆయన. మాణిక్ సర్కార్ భార్య పంచాలి భట్టాచార్య2011లో కేంద్ర సాంఘీక సంక్షేమ మండలి ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. ఆమె జీవితం కూడా సాధారణం. ‘అత్యంత స్వచ్ఛమైన’ ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందిన సీఎం మాణిక్ సర్కార్.
పాలనలో సోషలిజం మిళితం
కేరళ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఇ.కె. నాయనార్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. రాష్ట్రాన్ని గణనీయమైన సామాజిక, ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపించారు. ఆయన నిబద్ధత అంకితభావంతో చేసిన పాలనతో కేరళ ప్రగతిశీల విధానాలవైపు దృష్టి సారించింది. మంచి హ్యూమర్ ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. పేదల అభ్యున్నతి, విద్యను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఆయన విధానాలు రూపొందించారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై దృష్టి పెట్టడం కార్మికవర్గంతో ఆయనకున్న లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ప్రభుత్వం అందరికీ, ముఖ్యంగా బాలికలు, అల్ప ఆదాయ కుటుంబాలకు విద్యను ప్రోత్సహించే విధానాలను ప్రవేశపెట్టింది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నాలు రాష్ట్రంలో అధిక ఆయుర్దాయంకు దోహదపడ్డాయి. నాయనార్ ఆకర్షణ పార్టీ శ్రేణులకు అతీతంగా ఉండేది. సాధారణ ప్రజలతో, ముఖ్యంగా కార్మికులు, రైతులతో కనెక్ట్ అయ్యే విధానం ఆయన ఎదుగుదలకు దోహదపడింది. ఎన్నికల విజయాల్లో ఆ సంబంధాలు కీలకపాత్ర పోషించాయి. అభివృద్ధి ఆధారిత పాలనతో సోషలిజాన్ని మిళితం ఎలా చేయాలో చేసి చూపించారు. కేరళ వామపక్ష రాజకీయ స్రవంతిలో నిరంతర ఔచిత్యంలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టడం, ప్రజలకు అవసరమైన వస్తువులను అందించడానికి ‘మావేలి’ సరసమైన ధరల దుకాణాలను ప్రారంభించడం, సంపూర్ణ అక్షరాస్యత ప్రచారం, ప్రజా ప్రణాళికతో సహా అధికారాల వికేంద్రీకరణ మొదలైనవి కొన్ని ముఖ్యమైన విజయాలు. ఒక సారి పాలక్కాడ్ నుంచి ఎంపీగా గెలిచారు.
త్రిపుర అభివృద్ధిలో తనదైన ముద్ర
‘రాజా దశరథ్’ అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్ దేవ్ రహస్య జీవితం గడుపుతూనే 1952 జనరల్ ఎన్నికల్లో తూర్పు త్రిపుర నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారు. రహస్యంగా ఢిల్లీ వెళ్ళి, పార్లమెంటులో ప్రత్యక్షమై స్వతంత్ర భారతదేశంలో తాను స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఎందుకులేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ప్రధాని నెహ్రూ జోక్యంతో దశరథ్‌దేవ్, గణముక్తి పరిషత్ నాయకుల అరెస్ట్ వారెంట్లను రద్దుచేశారు. ఆయన 1952, 1957, 1962, 1967లలో ఎంపీగా ఎన్నికయ్యారు. 1978లో రామ చంద్రఘాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దశరథ్‌దేవ్, నృపేన్ చక్రవర్తి, బిరేన్‌దత్తాల నాయకత్వాన గిరిజనుల నాలుగు ముఖ్యమైన డిమాండ్లపై జరిగిన పోరాటం ఫలితంగా 1978లో విస్తృత ప్రజామోదంతో నృపేన్ చక్రవర్తి నాయకత్వంలో ఏర్పడిన వామపక్ష సంఘటన ప్రభుత్వంలో విద్యా, గిరిజన సంక్షేమశాఖల మంత్రిగా పనిచేశారు. వామపక్షసంఘటన ప్రభుత్వంలో 1983 నుంచి 1988 వరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1988 నుంచి 1993 వరకు ప్రతిపక్ష నాయకునిగా ఆయన కీలకపాత్ర పోషించారు.
1993 ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 44 స్థానాలు సాధించి సీపీఐ(ఎం) అధికారంలోకి వచ్చింది. 1993 ఏప్రిల్ 10న దశరథ్‌దేవ్ రాష్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 1998 మార్చి11 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. అధికారానికి వచ్చిన వెంటనే త్రిపురలోని వివిధ తిరుగుబాటు గ్రూపుల సభ్యులకు ప్రభుత్వం క్షమాభిక్షను ప్రకటించింది. త్రిపుర రాష్ట్రానికి మొదటి గిరిజన ముఖ్యమంత్రిగా ఆయన గిరిజనుల, పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. గిరిజనుల భాష అయిన కోక్‌బోరక్‌ను రాష్ట్రంలో రెండవభాషగా గుర్తించారు. రాష్ట్రంలో గిరిజన, గిరిజనేతరుల మధ్య స్నేహ, సామరస్యాల్ని నెలకొల్పటంలో దశరథ్‌దేవ్ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ప్రభుత్వం గ్రామీణపేదలకు పనికి ఆహారం పథకాన్ని అమలు చేసింది. మూడెకరాలలోపు భూమివున్న రైతులకు భూమిశిస్తును రద్దుచేసింది. అమలులో ఉన్న చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు బదిలీచేసిన గిరిజనుల భూములను తిరిగి వారికి అప్పగించింది. గిరిజన స్వయం ప్రతిపత్తి మండలిని ఏర్పాటుచేస్తూ చట్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆయన రచించిన ”నాస్మృతిపథంలో ప్రజా ఉద్యమాల చరిత్ర, జ్ఞాపకాలు”, ”గణముక్తి పరిషత్ చరిత్ర” పుస్తకాలు రాష్ట్ర ప్రజా ఉద్యమాల చరిత్రకు సంబంధించి అత్యంత విలువైన పుస్తకాలు.