అశ్రునయనాల మధ్య గోపాల్‌రావు అంత్యక్రియలు

Written by RAJU

Published on:

అశ్రునయనాల మధ్య గోపాల్‌రావు అంత్యక్రియలు– అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన కార్మికులు, నేతలు
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
ఏఐడీఈఎఫ్‌ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి జి.టి.గోపాల్‌రావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామం నుంచి బడంగ్‌పేట్‌ శ్మశానవాటిక వరకు సాగిన అంతిమయాత్రకు వివిధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు తరలివచ్చారు. అమర్‌ రహే కామ్రేడ్‌ జి.టి.గోపాల్‌రావు అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం శ్మశానవాటికలో గోపాల్‌రావు పెద్ద కుమారుడు జి.టి.వాసు చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి.
అంతకుముందు గోపాల్‌రావు మృతదేహానికి నాదర్‌గుల్‌ గ్రామంలోని ఆయన పెద్ద కుమారుడు ఇంటి వద్ద పలువురు నాయకులు నివాళ్లర్పించారు. సీపీఐ(ఎం), సీఐటీయూ, బీడీఎల్‌, డీఎల్‌ఆర్‌ఎల్‌, డీఆర్‌డీఓ ఏఐడీఈఎఫ్‌, టాప్రా, ఏఐడీఎఫ్‌, టీయూడబ్ల్యూఎఫ్‌ జర్నలిస్టు సంఘం నాయకులు నివాళులర్పించారు. ఆయన జీవిత కాలమంతా ఉద్యోగుల, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం పోరాటం చేసిన గొప్ప నాయకుడని వారు కొనియాడారు. ఆయన మరణం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి ముఖ్యంగా రక్షణ రంగానికి పెద్ద నష్టమన్నారు. అంతిమయాత్రలో సీపీఐ(ఎం) సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు జయరాజ్‌, యాదయ్య, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఆఫీస్‌ బేరర్లు జె.వెంకటేష్‌, జె.మల్లికార్జున్‌, ఎం.పద్మశ్రీ, కూరపాటి రమేష్‌, బీరం మల్లేష్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు తిరుపతయ్య, వై.సుబ్బారావు, టప్రా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం.ఎన్‌.రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, హైదరాబాద్‌ అధ్యక్షులు పి.శివలింగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights