
అవిసె గింజల్లో అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందులో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్‌లు, రాగి, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు ఉన్నాయి. ఒక చెంచా అవిసె గింజల్లో 1.3 గ్రాముల ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, రెండు గ్రాముల ఫైబర్, 0.3 మిల్లీగ్రాముల లిగ్నాన్‌లు ఉంటాయి. ఇవి అన్ని మన శరీరానికి ఎంతో అవసరమైనవి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రోటీన్ శరీర నిర్మాణానికి కీలకం. అలాగే రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు మన ఎముకలను బలపరుస్తాయి. శరీర కణాల పనితీరును మెరుగుపరుస్తాయి.
గుండె ఆరోగ్యం
అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. అవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులను అందించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండెపోటు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణ
అవిసె గింజలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అవి రక్తనాళాలను సడలించడంతో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటును సరిగ్గా నియంత్రించవచ్చు.
మధుమేహం
అవిసె గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ బాధితులకు ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే అవిసె గింజలు చక్కెర శోషణను నెమ్మదిగా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా చూస్తాయి.
కీళ్ల నొప్పులు
అవిసె గింజలు శరీరంలో వాపు తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల కీళ్ల నొప్పులను తగ్గించవచ్చు. అవిసె గింజలు ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ
అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అవి జీర్ణక్రియకు మంచివి. అవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ప్రీబయోటిక్ లక్షణాలు పేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. తద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
రక్తహీనత
అవిసె గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరన్ శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది.
అధిక బరువు
బరువు తగ్గాలనుకునేవారు అవిసె గింజలను తీసుకోవడం చాలా మంచిది. అవి ప్రోటీన్, ఫైబర్ ద్వారా కడుపుని నిండుగా ఉంచి తక్కువ కాలరీలతో ఎక్కువ న్యూట్రిషన్ అందిస్తాయి.
మెదడు ఆరోగ్యం
అవిసె గింజల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)