
హైదరాబాద్ నగరంలో బహదూర్‌పురాలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూం సర్వీస్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో 11 సర్వీసింగ్ బైకులు కాగా, ఒకటి కొత్త బైక్. వీటి పూర్తి విలువ గురించి ఇంకా పూర్తి సమాచారం అందలేదు. అయితే.. పెద్దమొత్తంలోనే ఆస్తి నష్టం సంభవించినట్లుగా భావిస్తున్నారు. నగరంలో ఈ మధ్య జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారానికి కనీసం రెండు, మూడు అయినా అగ్ని ప్రమాదాలు నగరంలో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. బహదూర్‌పురాలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూం సర్వీస్ సెంటర్‌లో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు అగ్ని ప్రమాదం గురించి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 12 బైకులు పూర్తిగా దగ్ధమైనట్లుగా గుర్తించారు. సర్వీస్ సెంటర్‌లోని మిగతా వాహనాలు అగ్నికి ఆహుతి కాకుండా జాగ్రత్తలు చేపట్టారు. షో రూమ్ మొత్తం మంటలు వ్యాపించకుండా వెంటవెంటనే నీటితో ఆర్పివేశారు. అంతేకాకుండా షో రూమ్ పక్కనే ఉన్న మిగతా షాపులకు కూడా మంటలు వ్యాపించకుండా కట్టడి చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షో రూంలో ఎలక్ట్రిక్ బైకులు ఉన్నట్లయితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టి పరిశీలిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకునే లోపే పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని, దీంతో అప్పటికే 12 బైకులు దగ్ధమై జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.