
ప్లేటులో రొయ్యల కర్రీ.. తినాలంటే వర్రీ అయ్యేలా చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై దిగుమతి సుంకం 3 శాతం నుంచి 26 శాతానికి పెంచేశారు దీంతో లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఇక లక్షా 26 వేలు కానున్నాయి. రవాణా, ప్యాకింగ్‌తో కలిపి ఎక్స్‌ట్రా బాదుడు 50 శాతానికి చేరుకుంటోంది. ఇక రొయ్య ధర కేజీకి రూ. 30 నుంచి 50 వరకు తగ్గించేసి రైతుల గుండెల్లో మరో గునపం గుచ్చారు ఎక్స్‌పోర్టర్స్. దీంతో రొయ్య రేటు ఒక్కసారిగా పడిపోయింది. అమెరికా పెంచిన ట్యాక్స్ ఈ నెల తొమ్మిది నుంచి అమలు కానుంది. రొయ్యల సాగు, ఎగుమతుల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఏపీ GSDPలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతం. 2 రోజుల క్రితం 100 కౌంట్ ధర రూ. 250 ఉంటే ఇప్పుడు 210 కి కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏపీ నుంచి అమెరికాకు ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయి. అమెరికాకు 50 కౌంట్ లోపు రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. కానీ అన్ని కౌంట్ల రొయ్యల రేటును వ్యాపారులు తగ్గించెయ్యడంపై రైతులు మండిపడుతున్నారు. ఆక్వా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో, ఆక్వా రంగానికి అండగా నిలవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న చంద్రబాబు.. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్‌పై అమెరికా 27శాతం సుంకం విధింపు వల్ల ఆక్వారంగానికి నష్టమంటూ వివరించారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని, ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని.. చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆక్వా రైతులకు మేలు చేసేలా కేంద్రం చర్యలు చేపడుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ఆక్వా రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు..
ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్లే సిండికేట్‌గా మారారని ఆరోపిస్తున్నారు. రైతులకు అండగా పోరాటం చేస్తామన్నారు.