అమెరికాకు చైనా బిగ్ షాక్.. US వస్తువులపై 84% సుంకం విధించిన డ్రాగన్!

Written by RAJU

Published on:

ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. బుధవారం(ఏప్రిల్ 9) నుంచి భారత్‌, చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. అమెరికా దేశ వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏకంగా 180 దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. ఇక అనుకున్న దానికంటే భారత్‌పై ఎక్కువగానే సుంకాల మోత మోగించారు.

ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. బుధవారం(ఏప్రిల్ 9) నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించింది. దీంతో ట్రంప్‌.. ఏప్రిల్‌ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే అదనంగా మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. చైనా టారిఫ్‌పై ట్రంప్‌ మాట్లాడుతూ ఇవన్నీ శాశ్వత సుంకాలన్నారు. తగ్గించే చర్చలు జరుపుతామన్నారు అమెరికా అధ్యక్షుడు. టారిఫ్‌లపై మొండి వైఖరి లేదన్నారు.

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ విధించిన 104 శాతం సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులన్నింటిపై 84 శాతం అదనపు సుంకాలను విధించింది. ఏప్రిల్ 10 నుండి అమెరికా నుండి వచ్చే వస్తువులపై ఈ అదనపు సుంకాలు విధించడం జరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. గతంలో ప్రకటించిన 34 శాతం నుండి బీజింగ్ ప్రతీకార సుంకం రేటు పెంచింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 12 అమెరికన్ సంస్థలను దాని ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. అదే సమయంలో 6 అమెరికన్ సంస్థలను దాని విశ్వసనీయ సంస్థ జాబితాలో చేర్చింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే, అమెరికా స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా భారీగా పతనమైనట్లు సమాచారం. ట్రంప్ చైనాపై 104 శాతం సుంకాలను విధించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. అదనపు సుంకాలు ఏప్రిల్ 9 బుధవారం నుండి వసూలు చేయడం జరుగుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. తన పరస్పర సుంకాలకు చైనా ప్రతీకార చర్యగా ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. మంగళవారం అధ్యక్షుడు 100 శాతానికి మించి సుంకాలను అమలు చేయడానికి ముందు చైనా నుండి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

చైనా, అమెరికా మధ్య ఈ సుంకాల యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రమైంది. రెండు దేశాలు ఒకదానికొకటి “టైట్-ఫర్-టాట్” విధానాన్ని అవలంబిస్తున్నాయి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది.

ఇక ఇవాళ్టి నుంచి భారత్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 26 శాతం ఎగుమతి సుంకాలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై 52 శాతం వరకు సుంకాలు విధిస్తోంది భారత్. దీంతో 26 శాతం రేటుతో రెసిప్రొకల్ టారిఫ్‌ను విధించారు ట్రంప్‌.. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరుపుతుంది విదేశాంగ శాఖ. ఇవి ఈ ఏడాది చివరికి ఫలప్రదం అయ్యే అవకాశముంది. ట్రంప్ టారిఫ్‌లు భారత ఎగుమతులపై కొంత ప్రభావం చూపినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా నష్టం ఉండకపోవచ్చని భావిస్తున్నారు నిపుణులు.

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights