సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి కి జీవకళ వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ పుణ్యమా అంటూ దాదాపు వెంటిలేటర్ మీదకు చేరిన అమరావతికి చంద్రబాబు ఊపిరి పోశారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా అమరావతిలో నిర్మాణాలు చేపడుతూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ వ్యవహారం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో, రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ సన్నాహాలు చేపట్టనుంది. ముందుగా 27 కిలోమీటర్ల ట్రాక్, కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం మరో 2 నెలల్లో టెండర్లు పిలవబోతున్నారు. కాజీపేట-విజయవాడ లైన్‌లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి ఈ రైల్వే లైన్ మొదలుకానుంది. అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ-గుంటూరు లైన్‌లో ఈ రైల్వే లైన్ కలవనుంది. ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 57 కిలోమీటర్లు.

27 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 450 కోట్లు, కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 2028 నాటికి పనులు పూర్తి చేసి అమరావతిలో రైలును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ ముందుకుపోతోంది. కానీ, రెండేళ్లలోనే రైల్వే లైన్ నిర్మాణం పూర్తిచేయాలని రైల్వేశాఖను చంద్రబాబు కోరారు. ట్రాక్ నిర్మాణం రెండేళ్లలో పూర్తయినా…వంతెన నిర్మాణానికి మూడేళ్లు పడుతుందని రైల్వేశాఖ చెబుతోంది. దాంతోపాటు, అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలవబోతున్నారు.
కాగా, ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల రీస్టార్ట్ కు ఏప్రిల్ మూడో వారంలో మోదీ రానున్నారు. లక్షలాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం మొదలుబెట్టారు. వెలగపూడి సమీపంలోని సచివాలయం వెనుక ఉన్న 250 ఎకరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.