“అమరావతి అంటే.. కేవలం రాజధాని కాదు. ఇదో విశ్వనగరం. ఇక్కడ ఎవరు ఏది కోరుకుంటే అది ల భించేలా చేస్తున్నాం. త్వరలోనే విశ్వ వైద్య నగరం ఏర్పాటు చేయాలనికూడా ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నాం“ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోగ్య విధానానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఈ క్రమంలోనే అమరావతిలో ఐటీ, విద్య, న్యాయ, పాలన వంటి.. నవ నగరాలతోపాటు.. విశ్వ వైద్య నగరాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలు కీలకమైన వ్యాధుల నుంచి బయట పడేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అధునాతన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమరావతిలోనే ప్రపంచ స్థాయి సదుపాయాలతో వైద్య విశ్వ నగరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

ఇక, ప్రస్తుతం ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ.. ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించను న్నట్టు చంద్రబాబు చెప్పారు. అదేసమయంలో 100 పడకలతో కూడిన సమగ్ర ఆసుపత్రిని కూడా.. నిర్మించనున్నట్టు తెలిపారు. వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీలోని ఒక్కొక్క జిల్లాలో ఒక్క విధమైన ఆరోగ్య సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు సంబంధించిన పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.