ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణం, చంద్రబాబు నివాసానికి భూమి పూజపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి భూమి పూజకు మమ్మల్ని పిలుస్తారు అనుకున్నాం, మమ్మల్ని పిలవకుండా ఇంటి కార్యక్రమం చేసుకుంటున్నారు మంచిదే, చంద్రబాబు గతంలోనే ఇల్లు కొనుక్కోవడం, అద్దెకు తీసుకోవడం చేయొచ్చు. కాని వివాదాస్పద నివాసంలో అద్దెకు ఉన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి రాజధాని అమరావతి అభివృద్ధి అవుతుంది, లేకపోతే కాదు అనడం కరక్ట్ కాదన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ కట్టుకున్నారు.. ఏం అభివృద్ధి జరిగింది?చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం వల్లనే అభివృద్ధి అనేది కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబుకి అభివృద్ధి కాంక్ష ఉంది. ఆలోచించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు కానీ వినాశనం వైపు కాదు. గత ఐదేళ్లు కేంద్రం నుంచి అమరావతికి అందిన సాయం సున్నా, గతంలో అమరావతి విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2014లో ఒక్క పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు 30 వేల ఎకరాలు సేకరించి మంచిపని చేశారన్నారు. ప్రస్తుతం అమరావతిలో 8 వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది.
దానిని డెవలప్ మెంట్ కి ఇచ్చినా బ్రహ్మాండమైన రాజధాని నిర్మితం అవుతుందన్నారు. అమరావతి మంచిగా అభివృద్ధి చెందుతుందని ఏపీ రాజధాని బావుండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకి విజన్ ఉంది. చంద్రబాబు విజన్ కి కేంద్రం సహకరించాలన్నారు. అదానీ, కార్పొరేట్ల ను ప్రసన్నం చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే తప్పు చంద్రబాబు చేయకూడదని, సామాన్య ప్రజానీకానికి ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.